అమూల్ డెయిరీ బిజినెస్‌తో భారీ లాభాలు.. ఫ్రాంఛైజీ ఇలా తీసుకోండి

Amul: ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటి. దేశంలో చాలా మంది రైతులు, ఇతరులు డెయిరీ మార్కెట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.


మంచి ఆదాయం వచ్చే బిజినెస్‌లో డెయిరీ మార్కెట్‌ ఒకటిగా గుర్తింపు పొందింది. పాలు, పాల ఉత్పత్తుల అమ్మకంతో భారీగా లాభాలు పొందవచ్చు. అయితే సొంతంగా బిజినెస్ ప్రారంభించడానికి బదులుగా, డెయిరీ కంపెనీల్లో డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ తీసుకోవడం మంచిది. దీనివల్ల వ్యాపారం త్వరగా ప్రారంభించవచ్చు, పెట్టుబడి కూడా తగ్గుతుంది. కంపెనీ రెప్యుటేషన్ కారణంగా మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేకుండానే లాభాలు అందుకోవచ్చు.

* బెస్ట్ బిజినెస్ ఫ్రాంచైజీ..

భారతదేశంలో డెయిరీ బిజినెస్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు అమూల్. ఈ సంస్థ 1946 నుంచి వివిధ రకాల డెయిరీ ప్రొడక్టులను అమ్ముతూ దేశంలోనే టాప్‌ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. అందుకే డెయిరీ బిజినెస్ చేయాలనుకునే వారు అమూల్ ఫ్రాంఛైజీ తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్, పెట్టుబడి, లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

* ఫ్రాంచైజీతో మంచి లాభాలు

భారతదేశంలో టాప్‌ డెయిరీ ప్రొడక్టు కంపెనీల్లో ఒకటైన అమూల్, ఫ్రాంచైజీ ఓనర్‌ లాభంలో వాటా తీసుకోదు. అందుకే చాలా ప్రాంతాల నుంచి ఫ్రాంచైజీ కోసం భారీ రిక్వెస్టులు వస్తున్నాయి. కానీ తమ ప్రొడక్టులను కమీషన్‌పై అమూల్‌ అందుబాటులో ఉంచుతుంది. ఈ ఫెసిలిటీలతో ఫ్రాంఛైజ్ ఓనర్‌ ఈ బ్రాండ్ ప్రొడక్టులను అమ్మి మరింత లాభం అందుకుంటారు.

* రిక్వైర్‌మెంట్స్‌ ఏంటి?

భారతదేశంలో అమూల్ రెండు రకాల ఫ్రాంచైజీలు అందిస్తోంది. కంపెనీ నుంచి ఫ్రాంచైజీ పొందాలంటే, సొంత దుకాణం లేదా వ్యాపారం కోసం తగినంత భూమి ఉండాలి. ఇందుకు కొన్ని అర్హతలు కూడా ఉండాలి. కంపెనీ అందించే ఫ్రాంచైజీల్లో అమూల్ అవుట్‌లెట్స్‌, పార్లర్స్‌ లేదా కియోస్క్, ఐస్ క్రీం స్కూపింగ్ పార్లర్స్‌ ఉన్నాయి. అమూల్ అవుట్‌లెట్స్‌, పార్లర్ లేదా కియోస్క్‌ కోసం కనీసం 150 చదరపు అడుగుల స్థలం ఉన్న షాప్ ఉండాలి. ఐస్‌క్రీం స్కూపింగ్ పార్లర్‌ కోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి.

* దరఖాస్తు చేసుకునే సైట్ ఇదే..

ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.amul.com ఓపెన్ చేయాలి. అవసరమైన వివరాలన్నీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అవుట్‌లెట్‌కు సంబంధించిన వారి వివరాలను retail@amul.coop ఇమెయిల్ అడ్రస్‌కి పంపాలి.

* ఎంత ఖర్చు అవుతుంది?

అమూల్ అవుట్‌లెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు రూ.25,000 డిపాజిట్ చేయాలి. ఇది నాన్‌ రీఫండబుల్‌ అమౌంట్. ఈ ఛార్జీ కాకుండా, కంపెనీ నిబంధనల ప్రకారం అవుట్‌లెట్ ఫ్రాంచైజీకి తగినట్లుగా చేయడానికి రూ.1 లక్ష ఖర్చు చేయాలి. ఫ్రీజర్స్, ఎక్విప్‌మెంట్‌పై మరో రూ.75,000 పెట్టుబడి పెట్టాలి.

* ఐస్ క్రీం ఫ్రాంచైజీ..

ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీని తీసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు షాప్ ఫ్రాంచైజీని సిద్ధం చేయడానికి రూ.4 లక్షలతో పాటు రూ.50,000 సెక్యూరిటీ మనీగా ఖర్చు చేయాలి. ఫ్రాంచైజీకి అవసరమైన పరికరాల కోసం మరో రూ.1.50 లక్షలు కూడా అవసరమవుతాయి.

* లాభాలు ఎలా ఉంటాయి?

అమూల్ కంపెనీ పాల ఉత్పత్తులపై 10 శాతం కమీషన్, ఐస్‌క్రీమ్‌పై 20 శాతం కమీషన్, హాట్ చాక్లెట్ డ్రింక్స్, షేక్స్, రెసిపీ ఐస్‌క్రీమ్‌లపై 50 శాతం కమీషన్ లభిస్తుంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు పాలసీల డీటేల్స్ వివరంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ లింకు https://amul.com/m/amul-franchise-business-opportunity విజిట్‌ చేయవచ్చు.