మలయాళ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న నటుడు మమ్ముట్టి. కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా మమ్ముట్టికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
యాత్ర మూవీతో తెలుగులో అశేష గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరైన మమ్ముట్టి తన అసలు పేరు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కాలేజ్ రోజుల్లో ఒమర్ షరీఫ్ గా గుర్తింపు
మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి. కానీ ఆ పేరు తర్వాత మమ్ముట్టిగా మారిందని, దాని వెనుక జరిగిన కథను వెల్లడించారాయన. తనకు ఆ పేరు పెట్టింది ఎవరో కాదని, తన చిన్ననాటి ఫ్రెండ్ శశిధరన్ తనకు ఆ పేరు పెట్టారని అతన్ని అందరికీ పరిచయం చేశారు. తాను కాలేజ్ లో చదువుకునేటప్పుడు అందరికీ తన పేరుని ఫేమస్ యాక్టర్ ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడినని చెప్పారు.
పొరపాటున చదివిన పేరే మమ్ముట్టిగా మారింది
తాను చెప్పినదాన్ని అందరూ నమ్మడంతో తన అసలు పేరు మహమ్మద్ కుట్టి అనే విషయం కాలేజ్ లో ఎవరికీ తెలీదని, ఓ రోజు ఐడీ కార్డు మర్చిపోవడంతో తన అసలు పేరు అందరికీ తెలిసిందని, తన ఫ్రెండ్స్ లో ఒకరు నీ పేరు షరీఫ్ కాదు, మమ్ముట్టి అని చెప్పాడని, ఐడీ కార్డులో ఉన్న మహమ్మద్ కుట్టి అనే పేరును అతను పొరపాటున మమ్ముట్టి అని చదివాడని, అలా పొరపాటుగా చదివిన పేరే మమ్ముట్టిగా మారిందని చెప్పుకొచ్చారు.
తన ఫ్రెండ్ పెట్టిన పేరుతోనే తాను పెద్ద హీరో స్థాయికి రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని చెప్పిన మమ్ముట్టి, తన పేరు మార్పు విషయంలో ఇప్పటికే ఎన్నో కథలొచ్చాయని, కానీ అవేవీ నిజం కాదని, అసలు నిజం ఇదేనని చెప్పి తన ఫ్రెండ్ ను అందరికీ పరిచయం చేశారు మమ్ముట్టి. ఇక మమ్ముట్టి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ సీనియర్ హీరో కేవలం సినిమాలు చేయడమే కాకుండా ఇతర సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
































