ఐ ప్యాక్ సర్వే లీక్!.. మూడో సర్వేలోనూ టీడీపీ-జనసేనలదే అధికారం?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేపట్టిన మూడో తాజా సర్వే లీక్ అయినట్లుగా తెలుస్తోంది. రెండు సర్వేల్లో వైసీపీకి ఓటమి తప్పదని చెప్పిన ఐప్యాక్ సర్వే తాజాగా చేపట్టిన మూడో సర్వేలో కూడా ఓటమి తప్పదని తేల్చేసిందని సమాచారం.
టీడీపీ-జనసేన కూటమికి-143, వైసీపీకి-32 వస్తాయని నిర్ధారించింది, వైఎస్ షర్మిల రాకతో ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా సీన్ మారిందంటూ రిపోర్ట్ బహిర్గతమైంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయడనంలో సందేహం లేదు. ప్రతి కార్యక్రమంలో జగన్‌ను ఉతికారేస్తుండడంతో టీడీపీ-జనసేన కూటమికి ప్లస్ పాయింట్‌గా మారింది. అదేవిధంగా వైసీపీ చేపట్టిన అభ్యర్థుల మార్పు చేర్పులు కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.


ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. దాదాపు ఏడాదిన్నర నుంచి వివిధ రకాల ప్రైవేటు సంస్థలతో పాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) చేపట్టిన ఐప్యాక్ సంస్థ సర్వే నిర్వహించింది. అందులో అధికార వైసీపీకి కొన్ని అనుకూల సర్వేలు రాగా, మరికొన్ని సంస్థలు టీడీపీకి మద్దతు పలికాయి
కానీ, తాజాగా ఐప్యాక్ మూడో సర్వేను లీక్ చేసింది. ఈ సారి టీడీపీ-జనసేన కూటమికి 143, వైసీపీకి-32 మించి సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సంక్షేమ పథకాలు జగన్‌ని కాపాడలేకపోతున్నాయని పీకే సర్వే తేల్చి చెప్పింది.

చంద్రబాబు అరెస్టు, షర్మిల రాకతో మార్పు

ఏపీ రాజకీయాల్లో తమకు ఓటమి లేదని గర్వపడిన సీఎం జగన్ కు చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరిగింది. వీటికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, జాబ్ క్యాలెండర్ వదలకపోవడం, పెరిగిన నిరుద్యోగం, పరిశ్రమలు లేకపోవడం, ఉద్యోగుల పట్ల అవలంభిస్తోన్న విధానాలు జగన్‌కు వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ప్రత్యేకించి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రాజకీయ సమీకరణాలు మరింత మారిపోయాయని సర్వేలో వెల్లడైంది.
ఐప్యాక్ సర్వేలో తేలిందేమిటంటే..

ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ సర్వేను ఆ సంస్థ ప్రతినిదులు మూడు పర్యాయాలు లీక్ చేశారు. మొదటి సర్వే 2023 ఆగస్టులో లీక్ చేశారు. ఆ సర్వేలో వైసీపీకి 35 నుంచి 50 సీట్లకు మించి రావని చెప్పింది. 2023 నవంబర్ నెలలో రెండో సర్వేను లీక్ చేసింది. ఆ సర్వేలో టీడీపీ-జనసేన కూటమికి-144 సీట్లు, వైసీపీకి-31 సీట్లు వస్తాయని చెప్పింది. రెండు రోజుల క్రితం ఐప్యాక్ సర్వేను లీక్ చేసింది. ఈ సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో 10 స్థానాలకు టీడీపీ-జనసేనకు-9, వైసీపీకి-1, విజయనగరం జిల్లాలో 9 స్థానాలకు టీడీపీ-జనసేనకు 6, వైసీపీకి 3, విశాఖ జిల్లాలో 15 స్థానాల్లో టీడీపీ-జనసేనకు-13, వైసీపీకి-2 వస్తాయని వెల్లడించింది.
అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లాలో19 స్థానాల్లో టీడీపీ జనసేనకు 17, వైసీపీకి 2, పశ్చిమ గోదావరి 15 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 14, వైసీపీకి 1, కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 14, వైసీపీకి 2, గుంటూరు జిల్లాలో 17 స్థానాలకు టీడీపీ-జనసేనకు 16, వైసీపీకి 1, ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు టీడీపీ-జనసేనకు 10, వైసీపీకి 2, నెల్లూరు జిల్లాలో 10 స్థానాలకు టీడీపీ, జనసేనకు 7, వైసీపీకి 3, చిత్తూరు జిల్లాలో 14 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 10, వైసీపీకి 4, కర్నూలు జిల్లా 14 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 10, వైసీపీకి-4, అనంతపురం జిల్లా 14 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 12, వైసీపీకి 2, కడప జిల్లా 10 స్థానాల్లో టీడీపీ-జనసేనకు 5, వైసీపీకి 5 స్థానాలు వస్తాయని పేర్కొంది.