AmitShah will become PM: బీజేపీకి 400 సీట్లు వస్తే, పీఎంగా అమిత్ షా, కమలనాధుల్లో చర్చ

AmitShah will become PM: నరేంద్రమోదీ తర్వాత ప్రధానమంత్రి అమిత్ షా అవుతారా? ఈ మధ్యకాలంలో దీనిపై ఎందుకు చర్చ జరుగుతోంది? 400 పైచిలుకు సీట్లను బీజేపీ ఎందుకు టార్గెట్‌గా పెట్టుకుంది? రాజ్యాంగం ఏమైనా మార్చే అవకాశముందా? ఎన్నికల ముందు ఈ చర్చ ఎందుకొచ్చింది? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. కాకపోతే ప్రత్యర్థి పార్టీల నుంచి దీనికి సంబంధించిన ఓ ఫీలర్ బయటకురావడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.


ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్లోగన్ 400 పైచిలుకు సీట్లు. ఈ మాట వెనుక అసలు మర్మం ఏమిటన్నది అంతా సస్పెన్స్. కాకపోతే రష్యా అధ్యక్షుడు పుతిన్ బాటలోనే నడవాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు లేకపోలేదు. తొలుత రష్యాకు ప్రధాని అయిన పుతిన్, రాజ్యాంగ సవరణకు కావాల్సినంత మెజార్టీ తెచ్చుకున్నారు. దాని తర్వాత అధ్యక్షుడి పోటీ చేసి కంటిన్యూ అవుతున్నారు. అదే బాటలో ప్రధాని మోదీ అడుగు వేస్తున్నారా అన్న సందేహాలు కలగమానదు.

అదే జరిగితే ఇండియా కూడా అధ్యక్ష పాలనకు శ్రీకారం చుడుతుందా? అప్పుడు అధికారాలన్నీ ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. ఎందుకంటే బీజేపీ రూలింగ్‌లోకి వచ్చాక బ్రిటీష్ చట్టాలను చాలా వరకు మార్చింది. ఈ క్రమంలో అధ్యక్ష తరహా పాలనకు కమలనాధులు ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. మోదీ అధ్యక్షుడైతే, ప్రధానిగా అమిత్ షా ఉండడం ఖాయం. అన్నట్లు ఆ మధ్య దేశంలో అధ్యక్ష ఎన్నికల గురించి భారీగా చర్చ జరిగింది. దీనికి కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు గతంలో పాలించిన పెద్దలు పలు సందర్భాలు చెప్పిన మాటలు గుర్తు చేశారు.

సీన్ కట్ చేస్తే.. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే అమిత్ షా ప్రధానమంత్రి కావడం ఖాయమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్లు నిండిన నేతలకు ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఎలాంటి పదవులు ఇవ్వరాదన్నది బీజేపీ ప్రధాన సిద్ధాంతం. ఈ నిబంధనను తీసుకొచ్చింది నరేంద్రమోదీయే. ఈ క్రమంలో బీజేపీకి చెందిన పలువురు సీనియర్లు అద్వానీ, మురళీమనోహర్ జోషి, యడ్యూరప్పుతోపాటు పలువురు రాజకీయాలకు దూరమయ్యారన్నది కేజ్రీవాల్ బలంగా చెప్పినమాట.

ప్రధాని నరేంద్రమోదీకి వచ్చే ఏడాదితో 75ఏళ్లు నిండుతాయి. ఆయనకు రిటైర్మెంట్ వయస్సు దగ్గరపడినట్టే. ఈ లెక్కన మోదీ తర్వాత రేసులో ఉన్నది అమిత్ షా అన్నది కేజ్రీవాల్ లెక్క. మరి తీసుకొచ్చిన నిబంధనను మోదీ కంటిన్యూ చేస్తారా? ఈ క్రమంలో ప్రెసిడెంట్ ఎన్నికలకు తెరలేపుతారా? అన్నది అసలు ప్రశ్న. కొద్దిరోజులు ఆగితే ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పడడం ఖాయమని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నమాట.