Gold Rates Record : బంగారం భారమే.. రికార్డు ధరకు చేరిన పసిడి

Gold Rate Crossed Record Price : భవిష్యత్తులో సామాన్యుడు బంగారం కొనాలన్నది కలగానే మిగిలిపోతుందేమో. ఎందుకంటే.. పెరుగుతున్న బంగారం ధర అలా ఉంది. రూ. 60 వేల నుంచి ఇప్పుడు ఏకంగా రికార్డు ధరకు చేరింది. అందని ద్రాక్షలా మారింది బంగారం. అందలమెక్కి కూర్చున్న బంగారం ధర.. ఎప్పుడు కిందికి దిగుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడెలాగూ పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవు. శ్రావణమాసం వరకూ ఆగాల్సిందే. ఇప్పుడు పెరిగినా కనీసం అప్పుడైనా బంగారం ధరలు తగ్గకపోవా అని ఎదురుచూస్తున్నారు పసిడిప్రియులు.


కానీ బంగారం మాత్రం నేను దిగనంటే దిగనంటోంది. వారం 10 రోజుల క్రితం 70 వేలకు తగ్గుతూ వచ్చిన బంగారం.. మళ్లీ పెరిగింది. ఏకగా రూ.74 వేల మార్కును దాటింది. దీంతో ఇలా అయితే బంగారం కొనేదెలా అని వాపోతున్నారు కొనుగోలుదారులు.

ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలిలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,180, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.68,010గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,030, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,860గా ఉంది. బెంగళూరు, కోల్ కతా, ముంబై నగరాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.