తీరు మారకుంటే 2019 రిపీట్ – కూటమికి తాజా సర్వే హెచ్చరిక

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలల కాలం పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది.


మాజీ సీఎం జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా రాజకీయం చేస్తున్నారు. త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో పాలనా – రాజకీయంగా తీసుకున్న నిర్ణయాల పైన కూటమి పార్టీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇదే సమయంలో పది నెలల్లో కూటమి నుంచి గెలిచిన ఎమ్మెల్యేల పైన ఒక ప్రముఖ సర్వే సంస్థ వెల్లడించిన రిపోర్ట్ లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ రిపోర్ట్ వైరల్ అవుతోంది.

సీన్ రివర్స్

ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్యంగా 164 సీట్లతో ఏర్పాటు అయింది. పది నెలల పాలన పూర్తి చేసింది. వైసీపీ 11 సీట్లకే పరిమితం కావటంతో ఇక ఇప్పట్లో వైసీపీ కోలుకోవటం సాధ్యం కాదనే అభిప్రాయంతో కూటమి నేతలు కనిపిస్తున్నారు. వైసీపీ తమకు వచ్చిన 40 శాతం ఓట్ షేర్ ఉందనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది. కాగా, పది నెలల కాలంలో కూటమి నుంచి గెలిచిన 164 మంది ఎమ్మెల్యేల పని తీరు పైన ఒక ప్రముఖ సర్వే సంస్థ పబ్లిక్ మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పది నెలల కాలం లోనే కూటమి నుంచి 71 మంది ఎమ్మెల్యేల పైన వారి నియోజకవర్గాల్లో 30 శాతం కంటే తక్కువ ఆమోదం కనిపిస్తోందని నియోజకవర్గాలను వెల్లడించింది.

ప్రజల్లో వ్యతిరేకత

కూటమి పార్టీలకు చెందిన 71 మంది పైన పది నెలల కాలంలో ఈ స్థాయిలో వ్యతిరేకత రావటాని కి కారణాలను సర్వే సంస్థ వెల్లడిం చింది. ఇదే సర్వే సంస్థ 2019 లో వైసీపీకి 148 స్థానాలు వస్తా యని అంచనా వేయగా.. 151 సీట్లు జగన్ పార్టీ నాడు దక్కించుకుంది. 71 మంది కూటమి ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని సర్వేలో తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో జోక్యం చేసుకోవటం.. వారే సొంతంగా నిర్వహించటం పైన పెద్ద స్థాయిలో ఫిర్యాదులు ఉన్నట్లు వెల్లడించింది. దీంతో పాటుగా లిక్కర్, సెటిల్మెంట్స్, మైనింగ్.. ప్రతీ విషయంలో లంచాలు.. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయటం వంటికి వ్యతిరేకతకు ప్రధాన కారణంగా సర్వేలో విశ్లేషించారు.

పలువురు ఎమ్మెల్యేలు వ్యాపారుల నుంచి వసూల్లతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి లంచా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అదే విధంగా పార్టీ కేడర్ తో దూరం గా ఉండటం తో పాటుగా గెలిచిన తరువాత పట్టించుకోవటం లేదనే కారణంగా వారితో కార్యకర్తలు దూరంగా ఉంటున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పాలన తిరస్కరించి.. కూటమికి పట్టం కట్టిన పది నెలల కాలంలోనే ఈ స్థాయి లో వ్యతిరేకత కనిపించటం కూటమికి డేంజర్ బెల్స్ గా భావించాలని సూచిస్తున్నారు. అటు జగన్ పదే పదే ప్రభుత్వం పైన భారీగా వ్యతిరేకత ఉందని చెప్పుకొస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ గ్రామీణ ప్రజల్లో ఎక్కువగా చర్చ సాగుతోంది. మరి..ఈ పరిస్థితిని సీఎం చంద్రబాబు.. పవన్ ఏ విధంగా సరి దిద్దుకుంటారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.