ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తోంది. వ్యవసాయ పరికరాలతో పాటుగా పంటను బట్టి సాగుకు సాయం అందిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మునగ సాగు చేసే రైతులకు సాయం చేస్తోంది.
ఆరోగ్యానికి మేలు చేసే పంట కావడంతో ఎక్కువ మంది రైతులు సాగు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తోంది. డ్వామా ద్వారా తోటల పెంపకం, వాటిని కాపాడటానికి డబ్బులు ఇస్తోంది. ఇటీవల కాలంలో రైతులు మునగ సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. రెండేళ్ల పాటూ తోట నిర్వహణకు ఎకరాకు రూ.1,00,828 వరకు ఇస్తోంది.. ఈ డబ్బును ఉచితంగానే ఇస్తోంది.
రైతులు తమ పొలంలో 25 సెంట్ల నుంచి ఒక ఎకరా, ఐదు ఎకరాల వరకు మునగను సాగు చేయొచ్చు. ఈ మేరకు డ్వామా ఉపాధి హామీ పథకం కింద డబ్బులు ఇస్తుంది. రైతులు దీనిని పూర్తిస్థాయి పంటగా సాగు చేయాలి.. అలాగే ఒక ఎకరాకు 448 మునగ మొక్కలు నాటాలి. రైతులు పొలంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయడంతో పాటుగా ఎరువులు వేయడానికి, మునగ తోటలో వేరే పంటలు వేయడానికి.. ఇలా రెండేళ్ల పాట తోటను చూసుకునేందకు ప్రభుత్వం సాయం చేస్తంది. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు వారి పొలం భూమి పాస్ బుక్ జీరాక్స్, 1B, ఉపాధి హామీ జాబ్ కార్డు జీరాక్ తీసుకోని మండల ఉపాధి హామీ కార్యాలయం లేదా MPDO లేదా గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌కి అందజేస్తే ఈ ప్రొసెస్ మొత్తం చేస్తారని అధికారులు చెబుతున్నారు.
గతంలో మునగ సాగుపై రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడు మునగ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. మునగ కాయలు, ఆకులు, ఆకు పొడిని ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. దీనితో మునగ సాగు లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఆకులు, విత్తనాలు, కాయలు అన్నీ ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అని సూచిస్తున్నారు. పొడిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయవచ్చు అంటున్నారు.. ఇలా రైతులు ఆదాయం పొందవచ్చంటున్నారు.
































