చెత్త ఇస్తే కూరగాయలు, పప్పులు.. ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనాపరమైన నిర్ణయాలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తోంది.


ముఖ్యంగా స్వచ్ఛతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం చెత్త నుండి సంపద సృష్టి చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా సరికొత్త కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సంకల్పించింది.

గ్రామాలలో చెత్త సేకరణపై ఫోకస్

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలోనూ చెత్త సేకరణకు చెత్త డబ్బాలను ఇంటింటికి అందించారు. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చెత్త సేకరణ బండ్ల వారికి ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ చాలామంది తడి చెత్తను పొడి చెత్తను ఒకటిగా కలిపి పడేయడం, ఎక్కడపడితే అక్కడ చెత్త పడేయడం, ఇక ఇంట్లో పాడైపోయిన వస్తువులను కూడా జమ చేసి పెట్టుకోవడం చేస్తున్నారు.

చెత్తకు కూరగాయలు , పప్పులు

ప్రజలలో అవగాహన కల్పించడంతోపాటు, ప్రజలు తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి చెత్త బండ్ల వాళ్లకే ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చెత్తకు సంపద అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎవరైతే తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చేసి గ్రామపంచాయతీ సిబ్బందికి ఇస్తారో వారికి కూరగాయలు, పప్పులు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.

గుంటూరు జిల్లాలో అమలవుతున్న విధానం

తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఇంట్లో ఉపయోగించని పనికిరాని వస్తువులను గ్రామపంచాయతీ సిబ్బందికి ఇస్తే వాటిని విలువ కట్టి కూరగాయలు, పప్పులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ విధానాన్ని గుంటూరు జిల్లాలో అమలు చేస్తుండగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారీగా ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పెద్ద గ్రామపంచాయతీలకు స్వచ్చ రధాలను తీసుకురానున్నారు.

స్వచ్చ రథాలపై ప్రభుత్వం యోచన

ఈ స్వచ్చ రధాలను కొనుగోలు చెయ్యాలా లేక ఇప్పటికే ఉన్న రేషన్ సరఫరాకు వినియోగించిన వాహనాలను వినియోగించాలా అన్న అంశం మీద ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అలాగే ఈ పథకం పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామాలలో సిఆర్పి లను నియమించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు దీనివల్ల కలిగే ప్రయోజనాల పైన అవగాహన కలిగిస్తారు.

చెత్త నుండి సంపద, చెత్తకు సంపద

తడి చెత్త ను, పొడి చెత్తను వేరు చేసే ఇవ్వడం వల్ల సేంద్రీయ ఎరువులను తయారు చేయనున్నారు. అటు చెత్త నుండి సంపద సృష్టి చేయడమే కాదు, చెత్తకు కూడా సంపదను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా మార్చాలని సంకల్పించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.