“ఉప్మా” అందరికీ నచ్చాలంటే ఇలా ట్రై చేయండి – మళ్లీ, మళ్లీ ఉప్మానే కావాలంటారు

ఈజీగా, అప్పటికప్పుడు టిఫిన్ కావాలంటే ఇంట్లో వాళ్లు ఉప్మా చేసి పెడుతుంటారు. వాస్తవానికి ఉప్మా సరిగ్గా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా, ఇంకా తినాలనిపిస్తుంది. ఫంక్షన్లలో చేసే ఉప్మా కూడా ఎంతో బాగుంటుంది. మీరు ఉప్మా ప్రియులైతే ఓ సారి ఇలా ట్రైచేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది.


కావల్సిన పదార్థాలు :

  • రవ్వ – 1 గ్లాసు
  • నూనె – 2 స్పూన్లు
  • నెయ్యి – 1 స్పూన్
  • ఆవాలు – అర స్పూన్
  • జీలకర్ర – అర స్పూన్
  • మినప్పప్పు – 1 స్పూన్
  • శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
  • కరివేపాకు – 2 రెమ్మలు
  • జీడిపప్పులు – 15
  • ఎండుమిర్చి – 3
  • ఉల్లిపాయ – 1
  • పచ్చిమిర్చి – 3
  • క్యారెట్ – 1
  • ఉప్పు – తగినంత
  • టమోటా – 1
  • పసుపు – చిటికెడు
  • కొత్తిమీర – కొద్దిగా
  • తయారీ విధానం :

    • ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకుని 2 స్పూన్ల నూనె, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చితే పూర్తిగా నె య్యితోనే చేసుకోవచ్చు. సన్నటి మంటపై నూనెలో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కరివేపాకు వేయించాలి. పోపు దినుసులు వేగిన తర్వాత జీడిపప్పులు, ఎండుమిర్చి వేయించాలి.
    • ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఐదారు పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ ముక్కలు వేసుకుని కలపాలి. ఉల్లిపాయలు, క్యారెట్ తొందరగా మెత్తబడేలా ఉప్పు వేసుకుని కలిపి మూతపెట్టుకుని 2 నిమిషాలు ఉడికించాలి. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత సన్నగా, పొడవుగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. చిటికెడు పసుపు (స్కిప్ చేయొచ్చు) వేసుకుని కలపాలి.
    • చాలా మంది ఉప్మాలో పసుపు అంతగా ఇష్టపడరు. కానీ, ఫంక్షన్లలో చేసే ఉప్మాలో చిటికెడు పసుపు వేస్తుంటారు. ఇపుడు ఉల్లిపాయలు, క్యారెట్, టమోటా ముక్కలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత కప్పు రవ్వకు 5 కప్పుల చొప్పున నీళ్లు పోసుకోవాలి. ఉప్పు రుచి చూసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకుని ఎసరు మరిగించుకోవాలి. ఇపుడు మంట కాస్త తగ్గించి రవ్వ పోసుకుని కలపాలి. రవ్వ పోస్తున్నపుడు జాగ్రత్తగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
    • ఆ తర్వాత మంట మీడియం ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకుని కడాయిపై మూతపెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు! ఇపుడు మూత తీసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అంతే! ఘుమఘుమలాడే ఉప్మా సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఇందులో పల్లీ చట్నీ, సాంబార్, నిల్వ పచ్చడి ఇలా ఏదైనా సరే! కాంబినేషన్ అద్దిరిపోతుంది. వీలైతే కారపూస కూడా వేసుకుని టేస్ట్ చూడొచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.