అమరావతి: ఏపీలో అనధికార, అక్రమ నిర్మాణాలకు సంబంధించి పురపాలక శాఖ ఇవాళ(గురువారం) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అన్ని రాష్ట్రాలకు ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రకటించారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్‌పై భవన యజమానుల వద్ద అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు. ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉంటేనే భవనాల్లోకి వచ్చేలా చూడాలని సూచనలు చేశారు. భవన నిర్మాణ ప్రణాళిక మంజూరు సమయంలోనే అండర్ టేకింగ్ తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయ్యే వరకు ప్లాన్ ప్రదర్శించేలా చర్యలు చేపట్టాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు.
ఎప్పటికప్పుడు అధికారులు బిల్డింగ్ ప్లాన్, నిర్మాణాన్ని తనిఖీ చేయాలని సూచించారు. ప్లాన్ మేరకు నిర్మాణం లేకపోతే నివాసయోగ్య ధ్రువపత్రం జారీ చేయకూడదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ స్పష్టపరిచారు. డీవియేషన్ సరిచేసే వరకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని చెప్పారు. డీవియేషన్ ఉన్న నిర్మాణాలకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇస్తే చర్యలు ఉంటాయని అన్నారు. నివాసయోగ్య ధ్రువపత్రం ఇస్తేనే తాగునీరు, డైనేజీ, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలకు ట్రేడ్, బిజినెస్ లైసెన్సులు జారీ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. జోనల్ ప్లాన్‌లోనూ డీవియేషన్ లేకుండా నిర్మాణాలు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. నివాసయోగ్య పత్రం చూశాకే బ్యాంకులు నిర్మాణాలపై రుణాలు ఇవ్వాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ సూచించారు.