ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చాక్లెట్లు తిని 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
పాఠశాలలో ఓ ఏడవ తరగతి విద్యార్థినికి ఆగంతకుడు చాక్లెట్ ప్యాకెట్ ఇవ్వగా దానిని తీసుకువచ్చి పాఠశాలలోని విద్యార్థినులకు పంచింది. పీఈటీ టీచర్ తో పాటు మరో 11 మంది ఆ చాక్లెట్లను తీసుకుని తిన్నారు. అయితే చాక్లెట్లు తిన్న విద్యార్థినులు ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవ్వడంతో ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థినుల కనురెప్పలు నల్లగా మారడంతో పాటు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందిపడుతున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తెలంగాణ నార్కోటిక్స్ బృందం నందికొట్కూరులోని నిషేధిత మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేసింది. దీంతో విద్యార్థులు తిన్న చాక్లెట్లు ఈ తయారీ కేంద్రానికి చెందినవా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. చాక్లెట్లను విద్యార్థినికి ఇచ్చిన ఆగంతకుడు ఎవరు అన్నదానిపై ఆరా తీస్తున్నారు.


































