గడచిన ఏడాదితో పోలిస్తే 2026లో కార్పొరేట్ సంస్థలు భారీగా నియామకాలు చేపట్టనున్నాయి.
ఈ ఏడాది భారతీయ కంపెనీలు 1.2 కోట్ల వరకు ఉద్యోగాలను అదనంగా ఇస్తాయని టీమ్ లీజ్ సంస్థ అంచనా వేసింది. గత ఏడాది ఈ సంఖ్య 80 లక్షల నుంచి కోటి వరకు ఉంది. ఈవై, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డియాజియో, టాటా మోటార్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలు క్యాంపస్ నియామకాలపై దృష్టి సారించాయి. ఉద్యోగుల్లో మహిళల వాటాను పెంచాలని కోరుకుంటున్నాయి. అకౌంటింగ్, ఆడిటింగ్ సేవలు అందించే ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై ఇండియా) జూన్ 2026తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి 14 వేల నుంచి 15 వేల మందిని నియమించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 50 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఏటా ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్ కాలేజీల నుంచి రెండు వేల మందిని తీసుకుంటున్నట్లు ఆ సంస్థ సీహెచ్ఆర్ఓ ఆర్తీ దువా తెలిపారు. డియాజియో ఇండియాలో డిజిటల్, సప్లై విభాగాల్లో నియామకాలు ఉంటాయని సంస్థ ప్రకటించింది.
ఈ రంగాల్లో ఎక్కువ అవకాశాలు
డిజిటల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో వృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ పేర్కొన్నారు. టాటా మోటార్స్ బ్యాటరీ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ వెహికల్స్, హైడ్రోజన్ ఫ్యూయల్ రంగాల్లో నియామకాలు చేపట్టనుంది. గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి మహిళలు, వికలాంగుల సంఖ్యను 33 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మోతీలాల్ ఓస్వాల్ సంస్థ టెక్నాలజీ, డేటా సైన్స్, ఏఐ విభాగాల్లో కొత్త ఉద్యోగులను తీసుకోనుంది. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంపై కూడా కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి.
































