ముంబైలో బ్రేక్ ఫాస్ట్ చేసి, కేవలం కొన్ని గంటల్లోనే దుబాయ్‌లో భోజనం చేయడం సాధ్యమవుతుందా? వినడానికి సైన్స్ ఫిక్షన్‌లా అనిపించినా, భారత్-యూఏఈ మధ్య ప్రయాణాన్ని పూర్తిగా మార్చే ఓ భారీ మౌలిక వసతుల ప్రాజెక్ట్‌పై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
అరేబియా సముద్రం గుండా వెళ్లే అండర్‌వాటర్ సూపర్‌సోనిక్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.
ముంబై-దుబాయ్ మధ్య అండర్‌వాటర్ రైలు మార్గం
వైరల్ వీడియో ప్రకారం, ‘డీప్ బ్లూ ఎక్స్‌ప్రెస్’ అనే ఈ ట్రైన్‌ను అరేబియా సముద్రం అడుగున నిర్మించి భారత్‌ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో అనుసంధానం చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ రైలు గంటకు 600 నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, ఇది చాలా విమానాల కంటే కూడా వేగంగా ఉంటుందని వీడియోలో పేర్కొన్నారు. హైపర్‌సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ ద్వారా సంప్రదాయ విమాన ప్రయాణాల కంటే తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అరేబియా సముద్రం లోతుల్లో ప్రత్యేక అనుభవం
ఈ ప్రాజెక్ట్‌లో మరింత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, సొరంగం గోడల వెంట పానోరమిక్ గ్లాస్ విండోలను ఏర్పాటు చేయనున్నారట. సముద్ర మట్టానికి సుమారు 200 మీటర్ల లోతులో ప్రయాణిస్తూ, బయట షార్క్‌లు, తిమింగలాలు, చేపల గుంపులు ఈదుతూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని వీడియో వివరిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద అండర్‌వాటర్ అక్వేరియంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు.
ప్రయాణికులకే కాదు… వాణిజ్య అవసరాలకూ ఉపయోగం
ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రయాణికుల కోసమే కాదు. ఈ సొరంగం ద్వారా దుబాయ్ నుంచి భారత్‌కు క్రూడ్ ఆయిల్ తరలించడంతో పాటు, భారత్ నుంచి దుబాయ్‌కు తాగు నీటిని పంపించే ఏర్పాట్లు కూడా ఉంటాయని వీడియో పేర్కొంది. ఇలా ఒకేసారి రెండు కీలక సమస్యలకు పరిష్కారం చూపేలా ఈ ప్రాజెక్ట్ రూపొందిస్తున్నట్టు సమాచారం.
భారీ పెట్టుబడి, పెద్ద ప్రయోజనాలు
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 50 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. అయితే దీని వల్ల 50 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టి అవుతాయని, ముంబై అంతర్జాతీయ హబ్‌గా మారుతుందని, భారత్-యూఏఈ మధ్య ప్రయాణ ఖర్చులు సుమారు 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రయాణ సమయం కేవలం రెండు గంటలే?
ఈ అండర్‌వాటర్ ట్రైన్ పూర్తయితే ముంబై-దుబాయ్ మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలకు పరిమితం అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి సగటున 3 నుంచి 3.5 గంటలు పడుతోంది. 2030 నాటికి ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే, అరుదైన సముద్ర జీవాలను చూస్తూ ఖండాంతర ప్రయాణం చేయొచ్చని వీడియోలో పేర్కొన్నారు.
ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఈ ప్రాజెక్ట్ ప్రారంభ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే భారత్, యూఏఈ ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ఈ అండర్‌వాటర్ రైలు ప్రాజెక్ట్ అమలుపై చర్చలు మొదలైనట్టు సమాచారం. ఇది వాస్తవ రూపం దాలిస్తే, ప్రపంచ రవాణా రంగంలో ఇది ఓ విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.


































