12 యేళ్ల తర్వాత మారనున్న ఇంటర్‌ సిలబస్‌.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్‌ అమలు చేసేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్‌ అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టే దిశగా అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో ఇంటర్‌ సిలబస్‌ అమలు తీరుపై ప్రత్యేక కమిటీలు అధ్యయనం చేస్తున్నాయి. వాస్తవానికి ఇంటర్‌ సిలబస్‌పై అధ్యయనం చేసి మార్పులు తేవాలని గత ప్రభుత్వం హయాంలోనే నిర్ణయించినప్పటికీ.. ఈ విద్యా సంవత్సరంలో అధ్యయనం నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్‌ను మార్చారు. అయితే ఇంటర్మీడియట్‌లో దాదాపు 12 యేళ్లుగా పాత సిలబస్సే కొనసాగుతోంది. దీనిని 2011-12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఎన్‌ఈపీ, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను సవరించి, దానిని 2025 -26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత 2026 -27 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ రెండో ఏడాది సిలబస్‌ను మార్చనున్నారు.

ఇంటర్‌ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కృతికా శుక్లా ఇంటర్‌ విద్యలో పలు మారపులు తీసుకొచ్చారు. కృతికా శుక్ల బాధ్యతలు చేపట్టాక జూనియర్‌ కాలేజీల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్‌ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారు చేసి పంపిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్‌ టెస్ట్‌ను ఆయా కాలేజీలే నిర్వహించుకోగా రెండో యూనిట్‌ టెస్ట్‌ మాత్రం రాష్ట్రవాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరిగే క్వార్టర్లీ పరీక్ష సైతం ఇదే తరహాలో ఉండనుంది. గతంలో ఎవరికి వారు యూనిట్‌ పరీక్షలు నిర్వహించుకునేవారు. దీంతో సిలబస్‌ పూర్తి కాని పాఠ్యాంశాలను మినహాయించి మిగిలిన వాటికి పేపర్లు తయారు చేసేవారు. కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షలతో అన్ని కాలేజీల్లో ఒకేసారి సిలబస్‌ పూర్తి చేసేలా మార్పు తెచ్చారు. ప్రైవేట్‌ కాలేజీలు సైతం ఇదే విధానం అనుసరిస్తున్నాయి. బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను సైతం వచ్చే ఏడాది సవరించి కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్లల్లో 6-10 తరగతుల వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్‌ సిలబస్‌ను కూడా జాతీయ సిలబస్‌కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఇంటర్‌ స్థాయిలో నీట్, ఐఐటీ లాంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్‌ను అనుసరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ, నీట్‌ సిలబస్‌కు అనుగుణంగా సిద్ధం చేస్తూ సిలబస్‌ మార్చనున్నారు.