‘ఛాంపియన్’ రూ.47 కోట్లా?

సినిమాని వ్యాపారంలా కాకుండా దాన్నో ప్యాషన్‌గా చూసే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. సి.అశ్వనీదత్ ఈ కోవకు చెందిన నిర్మాతే. ఆయన సినిమాలన్నీ భారీగా ఉంటాయి.


వైజయంతీ మూవీస్ నుంచి పుట్టుకొచ్చిన మరో నిర్మాణ సంస్థ.. స్వప్న సినిమాస్‌. అశ్వనీదత్ కుమార్తెలు ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు తీసుకొన్నారు. ఎప్పుడైతే స్వప్నదత్‌, ప్రియాంక దత్‌.. చేతుల్లోకి ప్రొడక్షన్ వెళ్లిపోయిందో, అప్పటి నుంచీ వాళ్లదైన మార్క్ చూపించడం మొదలెట్టారు. మహానటి, కల్కి, సీతారామం విజయాల వెనుక వీరిద్దరి కృషి, పట్టుదల ఎంతో ఉంది. సినిమా మేకింగ్ లో… తండ్రి బాటలో వెళ్తూనే తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు స్వప్న సినిమాస్ సంస్థ నుంచి ‘ఛాంపియన్’ వస్తోంది. ఈనెల 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.47 కోట్లు.

రోషన్ కి ఇది రెండో సినిమా. హీరోగా చేసిన తొలి సినిమా ‘పెళ్లి సందడి’ హిట్. కాకపోతే ఆ పేరంతా.. హీరోయిన్ శ్రీలీల ఖాతాలో వెళ్లిపోయింది. పైగా ఆ సినిమా బడ్జెట్ రూ.4 కోట్లలోపే. అయితే… ‘ఛాంపియన్‌’ దగ్గరకు వచ్చేసరికి పది రెట్లు పెరిగిపోయింది. హీరోగా… రోషన్ క్యాలిబర్ ఎంతో తెలియకుండా, కేవలం కథపై నమ్మకంతో స్వప్న, ప్రియాంక ఈ ఇంత మొత్తం పెట్టుబడి పెట్టేశారు. రోషన్ పై రూ.47 కోట్ల సినిమా అంటే రిస్కే. కాకపోతే.. స్వప్న సినిమాస్ సంస్థకు ఉన్న క్రెడిబులిటీ వల్ల ఓటీటీ హక్కులు ముందే అమ్మారు. నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.16 కోట్లకు ఈ సినిమా కొనేసింది. మరో 30 కోట్లు థియేటర్ నుంచి రావాలి. 25న చాలా సినిమాలొస్తున్నాయి. అయితే మొదటి ఆప్షన్‌… ఛాంపియన్ మాత్రమే. తెలంగాణలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆ పాయింట్ కనెక్ట్ అయితే నైజాం నుంచి మంచి వసూళ్లు అందుకోవొచ్చు. ప్రమోషన్లు గట్టిగా చేస్తే ఓపెనింగ్స్ రాబట్టుకోవొచ్చు. మంచి సినిమా వేరు, కమర్షియల్ సినిమా వేరు… అనుకోవడం లేదెవరూ. ‘ఇది మంచి సినిమా..’ అనే టాక్ వస్తే, కచ్చితంగా వసూళ్లు బాగుంటున్నాయి. సో… ‘ఛాంపియన్‌’ మంచి టాక్ తో రిలీజ్ కావడం చాలా అవసరం. రోషన్ కెరీర్‌కు మంచి పునాది ఏర్పాడాలి అంటే.. `ఛాంపియన్‌`తో హిట్టు కొట్టాల్సిందే. స్వప్న సినిమాస్‌కు కూడా ఈ సినిమా చాలా కీలకంగా మారింది. మరి వాళ్ల నమ్మకం ఏ స్థాయిలో కాసులు కురిపిస్తుందో చూడాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.