‘భారతీయుడు’ కనుగొన్న పురాతన పెట్రా మార్గం ద్వారా వాణిజ్యం ఇప్పుడు సాధ్యమేనా?

జోర్డాన్‌ సందర్శన సందర్భంగా భారత్ – యూరప్ మధ్య వాణిజ్యాన్ని, ఈ వాణిజ్యంలో పెట్రా నగరం పోషించిన పాత్రను గుర్తు చేస్తూ, ‘ఉజ్వల భవిష్యత్తు కోసం మనం గత వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలి” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.


ఒకప్పుడు ప్రపంచ పటం నుంచి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఈ పెట్రా, ఒక ‘భారతీయుడి’ చొరవతో మళ్లీ తెరపైకి వచ్చింది.

అయితే, ఈ వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించడం సాధ్యమేనా? అని కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

ఎడారి మధ్యలో ఉన్నప్పటికీ, అక్కడ నీటి కొరత ఎందుకు లేదు? వందలాది ఒంటెలతో వచ్చిన వర్తకులు అక్కడ విశ్రాంతి తీసుకుని, యూరప్ వైపు ఎలా ప్రయాణించారు?

ప్రాచీన కాలంలో భారత్, యూరప్ మధ్య వాణిజ్యంలో ఈ నగర ప్రాముఖ్యత ఏంటి? ఆ తర్వాత దీని ప్రాబల్యం ఎందుకు తగ్గిపోయింది?

పెట్రా వైభవం, పతనం..

క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో పెట్రా ఒక వాణిజ్య కేంద్రంగా, సంపదతో వెలుగొందేది. పెట్రా అంటే గ్రీక్‌లో ‘రాయి’ అని అర్థం.

‘నబాటేయన్లు’గా పిలిచే సంచార అరబ్ తెగ ఈ ప్రాంతాన్ని పాలించింది. పెట్రా వారి రాజధాని.

పెట్రా సగం నిర్మిత నగరం. చాలా వరకు రాళ్లతోనే చెక్కి ఉండేది. ఒకానొక సమయంలో, దాదాపు 10 వేల నుంచి 30 వేల మంది అక్కడ నివసించేవారు.

ఎర్ర సముద్రానికి (రెడ్ సీకి), మృత్యు సముద్రానికి (డెడ్ సీకి) మధ్యలోని పెట్రా ప్రాంతం పురాతన కాలం నుంచి ఉంది. గ్రీక్, రోమన్, పర్షియన్ కాలాల్లో ఇది వాణిజ్య కేంద్రంగా ఉండేది.

అరేబియా, ఆఫ్రికా నుంచి ఫ్రాంకిన్‌సెన్స్ (సాంబ్రాణి అని పిలిచే సుగంధ ద్రవ్యం), చైనా నుంచి పట్టు, భారత్ నుంచి మసాలా దినుసులు, టీ, వజ్రాలు, ఆభరణాలు, కాటన్ వస్త్రాలు ఈ మార్గం గుండానే యూరప్ దేశాలకు వెళ్లేవి.

ఆ సమయంలో సముద్ర మార్గంలో కార్యకలాపాలు అంతంతమాత్రమే. వాణిజ్యమంతా ఒంటెల (కామెల్ కారవాన్) ద్వారానే జరిగేది. ఒంటెలపై సరుకులను తీసుకెళ్లే వర్తకులు పెట్రాలో విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు.

పెట్రాలోని ప్రజలు ఆనకట్టలు కట్టి, చుట్టుపక్కలున్న ఎత్తైన ప్రదేశాల నుంచి, వర్షాకాలాల్లో నీటిని సేకరించేవారు. ఆ తర్వాత కాలువలు, పైప్‌ల ద్వారా మంచినీటిని కిందకు తీసుకొచ్చేవారు. గ్రావిటీ ద్వారా ఈ నీరు సహజంగానే దిగువకు ప్రవహించేది.

ఈ నగరం సంపన్నంగా ఉండేది, పెట్రా గుండా వెళ్లే ఉత్పత్తులపై 25 శాతం వరకు పన్నులు విధించే వారు. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రముఖ వారసత్వ ప్రదేశాల్లో పెట్రా ఒకటి.

ఎత్తైన ప్రదేశాల్లో నిర్మించిన ఆనకట్టలు, సమాధులు, ఏనుగుల ముఖాలతో చెక్కిన రాతిశిల్పాలు, సమాధులు, చర్చిలు, ఆలయాలు, ఇతర కట్టడాల అవశేషాలు పెట్రా నగర వైభవాన్ని తెలియజేస్తాయి.

రెండో శతాబ్దంలో రోమన్లు ఈ ప్రాంత ప్రాధాన్యతను గుర్తించి, తమ సామ్రాజ్యంలో కలుపుకున్నారు. తద్వారా రెండవ శతాబ్దం ప్రారంభంలో ఈ ముఖ్యమైన వాణిజ్య మార్గంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు.

జోర్డాన్‌లోని ప్రముఖ కింగ్స్ హైవే

రోమన్లకు ‘వయా నోవా ట్రయానా (Via Nova Traiana)’ అనే రోడ్డు ఉండేది. ఇస్లామిక్ కాలంలో హజ్‌కు మార్గం కూడా ఇదే.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో ”గుజరాత్, యూరప్ మధ్య వాణిజ్యం పెట్రా ద్వారా సాగేది” అని చెప్పారు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రాచీన వాణిజ్య మార్గాన్ని పునరుద్ధరించాల్సి ఉందన్నారు.

భరూచ్ నుంచి మధ్యధరా సముద్రం లేదా యూరప్‌ వైపు సముద్ర మార్గంలో వస్తువులను ఎగుమతి చేసే సమయంలో పెట్రా ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేదని అన్నారు.

సరికొత్త, సురక్షితమైన వాణిజ్య మార్గాలను కనుగొన్నారు. సుదూరాలకు పెద్దమొత్తంలో వస్తువులను, ఉత్పత్తులను సముద్రం గుండా రవాణా చేయగలిగారు. ఆ తర్వాత ఈ ప్రాంతంపై బెడోయిన్ కమ్యూనిటీ ఆధిపత్యం చెలాయించింది.

ఆ తర్వాత రోమన్లు పెట్రా పైన కంటే, ఎక్కువగా కాన్‌స్టాంటినోపుల్ (నేటి ఇస్తాంబుల్)పై దృష్టి పెట్టారు. అది ఆ నగర అభివృద్ధికి కారణమైంది.

4వ శతాబ్దంలో, పెట్రాలో భయంకరమైన భూకంపం సంభవించింది. దీనివల్ల ఎన్నో కట్టడాలు, భవనాలు కుప్పకూలాయి. ఇది నగర నీటి సరఫరా వ్యవస్థను దెబ్బతీసింది. ఫలితంగా అక్కడ జనాభా తగ్గిపోయింది. మరో భూకంపం.. అక్కడి ప్రజలను సమీపంలోని మరో మైదాన ప్రాంతానికి తరలి వెళ్లేలా చేసింది.

7వ శతాబ్దంలో ఈ పట్టణంపై దాడి జరిగిందని, 12వ శతాబ్దపు నాటి క్రూసేడ్ల (మధ్యయుగంలో యూరప్‌లో జరిగిన ధార్మిక యుద్ధాలు) కాలంలో ఇది సైనిక స్థావరంగా ఉండేదని రిపోర్టులు చెబుతున్నాయి. అక్కడ క్రైస్తవ జనాభా ఉండేదని చెప్పేందుకు పెట్రాలో లభించిన చర్చి శిథిలాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఈ మార్గాన్ని తిరిగి పునరుద్ధరించాలని ప్రధాని మోదీ అంటున్నారు. అయితే, అది సాధ్యం కాకపోవచ్చని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు.

ప్రస్తుతం, పెట్రా ఒక పర్యటక ప్రదేశం. 1985లో, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన తర్వాత, ఇక్కడకు వచ్చే పర్యటకుల సంఖ్య పెరిగింది.

ఇప్పుడది రవాణా కేంద్రం కాదు. జోర్డాన్‌లో ఉన్న ఏకైక నౌకాశ్రయం అకాబా, అది కూడా పెట్రాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రోడ్డు మార్గం ద్వారా పెట్రాకు వస్తువులను రవాణా చేయడం అంత సులభం కాదు. పెట్రా కూడా తయారీ కేంద్రం లేదా పారిశ్రామిక కేంద్రం కాదు. అక్కడన్ని సౌకర్యాలు లేవు.

‘భారతీయుడి’ అన్వేషణ

జోహాన్ లుడ్విగ్ బర్క్‌హార్ట్ స్విట్జర్లాండ్‌లో పుట్టారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.

ఆ తర్వాత సిరియా వెళ్లి, అరబిక్ భాష నేర్చున్నారు. ఇస్లామిక్ పద్ధతులను, ఆచారాలను తెలుసుకున్నారు. జోహాన్ ఎక్కువగా ముస్లిం వస్త్రధారణలోనే ఉండేవారు.

జోహాన్ సిరియాలో ఉన్నప్పుడు, ‘లాస్ట్ సిటీ’ గురించి తెలుసుకున్నారని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి శ్యామ్ శరణ్ చెప్పారు.

అక్కడకు వెళ్లేందుకు, షేక్ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా అనే భారతీయ ముస్లిం వ్యాపారిగా మారారు. దీంతో, తేలికగా ఆ నగరానికి చేరవచ్చని, తనని ఎవరూ గుర్తుపట్టరని భావించారు.

ప్రవక్త ముహమ్మద్ సహచరుడు ఆరోన్ సమాధి దర్శించేందుకు జోహాన్ బయలుదేరారు. ఈ సమాధి పెట్రాలో ఒక పక్కన ఉండేది. బెడోయిన్ తెగ వారు ఆయనను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆయన అక్కడ కొన్ని పురావస్తు అవశేషాలను గుర్తించారు, వాటిని రికార్డ్ చేశారు. అబు సింబెల్‌లో ధ్వంసమైన రాతి దేవాలయాలను జోహాన్ కనుగొన్నారు.

బర్క్‌హార్ట్ జీవితాంతం తన అసలు గుర్తింపును బయటపెట్టలేదు. సిరియాలో ఆయన చనిపోయిన తర్వాత కూడా, ఆయన సమాధిపై షేక్ ఇబ్రహీం బిల్ అబ్దుల్లా అనే రాశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.