ఇంట్లో ఈ చోట శ్రీకృష్ణుడి ఫోటో ఉంటే.. అదృష్టం తలుపు తడుతుందంట.

న జీవన విధానంలో ఆధ్యాత్మికత, విశ్వాసం విడదీయరాని భాగాలు. ముఖ్యంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే, కుటుంబంలో సుఖశాంతులు నిలవాలంటే వాస్తు పాత్ర చాలా కీలకమని పెద్దలు చెబుతుంటారు.


అందుకే పూజ, దేవతల ఫోటోలు, విగ్రహాల విషయంలో చాలా మంది ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఈ క్రమంలోనే చాలా ఇళ్లలో తప్పనిసరిగా కనిపించే దేవుడు శ్రీకృష్ణుడు. బాలగోపాలుడిగా, రాధాకృష్ణులుగా, గీతోపదేశం చేస్తున్న రూపంలో ఆయన ఫోటోలు, ప్రతిమలు ఇంట్లో పెట్టుకుంటారు. అయితే.. ఈ ఫోటోలను ఎక్కడ, ఎలా ఉంచాలి అన్నది వాస్తు ప్రకారం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రేమ, ఆనందం, జ్ఞానం, కరుణకు ప్రతీకగా భావిస్తారు. ఆయన రూపం ఇంట్లో ఉంటే సానుకూల శక్తి విస్తరిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని విశ్వాసం. దంపతుల మధ్య సఖ్యత పెరగడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనడం వంటి శుభఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బాలకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఇంట్లో ఉంటే ధనప్రాప్తి, సమృద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం.

విద్యార్థులు ఉన్న ఇళ్లలో శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటే చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, పరీక్షల్లో విజయం సాధిస్తారని అంటారు. అలాగే పెద్దలకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి, విచక్షణ కలుగుతుందని చెబుతారు. అంతేకాదు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేసి, పాజిటివ్ ఎనర్జీని పెంచే దివ్యశక్తి శ్రీకృష్ణుడికి ఉందని విశ్వాసం.

అయితే ఈ శుభఫలితాలు పొందాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పగుళ్లు ఉన్న ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంగా ఉండేలా ఉంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా తూర్పు ముఖంగా ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పూజగది ఈశాన్య మూలలో ఉంటే, అక్కడే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచడం అత్యుత్తమం.

దక్షిణ దిశలో శ్రీకృష్ణుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచడం మంచిది కాదని చెబుతారు. అలాగే పడకగదిలో పెట్టడం కూడా వాస్తు పరంగా అనుకూలం కాదని సూచన. విగ్రహాన్ని నేరుగా నేలపై కాకుండా పీఠంపై ఉంచాలి. ఈశాన్య దిశలో శ్రీకృష్ణుడి దివ్యరూపం ఉంటే ఆ ఇంట్లో ప్రేమానురాగాలు పెరిగి, ఆర్థిక శ్రేయస్సు కూడా లభిస్తుందని నమ్మకం. చిన్న మార్పు… కానీ ఫలితం మాత్రం జీవితాన్నే మార్చేలా ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

(గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.