అలాంటి తొందరపాటు నిర్ణయాల వల్లే మూడు పెళ్లిళ్లు ఒక సహజీవనం

తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 650కి పైగా సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న నటి లక్ష్మీ.


ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆయా సినిమాలు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. విశేషం ఏమిటంటే.. కమర్షియల్‌ హీరోయిన్‌గా కాకుండా తమ సినిమాల్లో టిపికల్‌ క్యారెక్టర్‌ వుంటే దానికి లక్ష్మీనే సంప్రదించేవారు. ఆమె కూడా అలాంటి పాత్రలు చేసేందుకు ఇష్టపడేవారు.

ఎందుకంటే స్వతహాగా లక్ష్మీ ఒక టిపికల్‌ క్యారెక్టర్‌. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. అమ్మగా, అక్కగా, వదిగా.. ఇలా ఆయా పాత్రలకు జీవం పోస్తున్నారు.

ఇప్పటికీ తనకు తగిన క్యారెక్టర్‌ వస్తే చేస్తున్నారు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిథునం’ చిత్రంలో ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం సరసన ఎంతో వైవిధ్యమైన పాత్ర పోషించారు. ఈ చిత్రంలోని నటనకుగాను స్పెషల్‌ జ్యూరీ నంది అవార్డును అందుకున్నారు లక్ష్మీ. 1952 డిసెంబర్‌ 13న వై.వి.రావు, రుక్మిణి దంపతులకు మద్రాస్‌లో జన్మించారు లక్ష్మీ.

ఆమె పూర్తి పేరు యారగుడిపాటి వెంకట మహాలక్ష్మీ. తండ్రి వై.వి.రావు నటుడు, దర్శకుడు. తల్లి రుక్మిణి కూడా పలు సినిమాల్లో నటించారు. అలా లక్ష్మీకి కూడా సినిమాలపై ఆసక్తి కలిగింది.

1968లో విడుదలైన ‘జీవనాంశం’ అనే తమిళ సినిమాలో తొలిసారి నటించారు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆ సినిమాలోని నటనకు ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సంవత్సరం ఎస్‌.వి.రంగారావు దర్శకత్వంలో వచ్చిన ‘బాంధవ్యాలు’ చిత్రం ద్వారా తెలుగులో పరిచయమయ్యారు.

ఇక ఆ తర్వాత వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ స్పీడ్‌ను చూసి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. 1969లో భాస్కరన్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. అతను లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేసేవారు.

వీరిద్దరి సంతానమే ఐశ్వర్య. తర్వాతి కాలంలో ఆమె కూడా నటిగా కొన్ని సినిమాల్లో నటించారు. కొన్నాళ్లపాటు భాస్కరన్‌, లక్ష్మీ వైవాహిక జీవితం బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో 1974లో విడాకులు తీసుకున్నారు.

అదే సంవత్సరం ఆమె మలయాళంలో నటించిన ‘చట్టకారి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలోని జూలీ పాత్ర ఆమెకు విపరీతమైన పేరు తెచ్చింది. ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ అవార్డుతోపాటు, కేరళ స్టేట్‌ అవార్డు కూడా ఆమెను వరించింది. ఈ చిత్రాన్ని లక్ష్మీతోనే ‘జూలీ’ పేరుతో హిందీలో రీమేక్‌ చేసింది విజయ ప్రొడక్షన్స్‌ సంస్థ.

హిందీలో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఉత్తమనటిగా మరోసారి ఫిలింఫేర్‌ అవార్డు అందుకున్నారు లక్ష్మీ. ‘చట్టకారి’ చిత్రం చేస్తున్న సమయంలోనే అందులో హీరోగా నటించిన మోహన్‌శర్మ ప్రేమలో పడ్డారు లక్ష్మీ. ఒకరోజు ఒక హోటల్‌కి అతన్ని ఆహ్వానించి తను ప్రేమిస్తున్న విషయం చెప్పారు.

అతను కూడా ఓకే చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మనం పెళ్లి చేసుకోవాలని కోరింది. వెంటనే నుదుటిపై బొట్టు పెట్టి లక్ష్మీని భార్యగా స్వీకరించారు మోహన్‌. అంతేకాదు, తమ శోభనం కూడా తక్షణమే జరిగిపోవాలని కూడా చెప్పడంతో అదే హోటల్‌లో శోభనం జరుపుకున్నారు. చిన్నతనం నుంచి ముక్కు సూటిగా వుండే మనస్తత్వం లక్ష్మీది.

ఎవరినీ లెక్క చేసేవారు కాదు. ఒకరి గురించి తన జీవితాన్ని మార్చుకునే మనస్తత్వం కాదు. తనకు నచ్చినట్టు ఉండడానికే ఇష్టపడేవారు. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసేసుకునేవారు.

అలా తీసుకున్న నిర్ణయమే మోహన్‌తో పెళ్లి. రెండో భర్తతో కూడా ఎక్కువ కాలం ఆమె కాపురం చేయలేకపోయారు. లక్ష్మీ స్పీడ్‌కి మోహన్‌శర్మ తట్టుకోలేకపోయారు. ఫలితంగా మనస్పర్థలు రావడంతో 1980లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

1987 వరకు ఒంటరిగానే ఉన్న లక్ష్మీ.. తమిళ దర్శకుడు శివచంద్రన్‌ను పెళ్లి చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక పాపను వీరు దత్తత తీసుకున్నారు. ఆమె పేరు సంయుక్త.

అయితే మధ్యలో కన్నడ నటుడు అనంత్‌నాగ్‌తో కొన్నాళ్లు సహజీవనం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన లక్ష్మీ వైవాహిక జీవితం ఇన్ని మలుపులు తిరగడానికి ఆమె తీసుకునే తొందరపాటు నిర్ణయాలే కారణమని చెబుతుంటారు. ఆమెకు జరిగిన పెళ్లిళ్ల క్రమాన్ని చూస్తే అది అర్థమవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.