ఐటీఆర్ ఫైలింగ్ గడువు ఆగస్టు 31 వరకు పెంచారా?.. ఐటీ అధికారులేమంటున్నారు

www.mannamweb.com


ITR deadline: ఐటీఆర్ రిటర్నుల గడువుకు సంబంధించిన ఫేక్ వార్తలపై ఆదాయపు పన్ను శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల క్లిప్పింగ్ ఫేక్ అని పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జూలై 31 అని ఐటీ శాఖ తెలిపింది.

సోషల్ మీడియా వార్తలు ఫేక్

“ఐటీఆర్ ఈ-ఫైలింగ్ తేదీని పొడిగించడానికి సంబంధించి సందేశ్ న్యూస్ వారి న్యూస్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని మాకు తెలిసింది. ఇది ఫేక్ న్యూస్. పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ / పోర్టల్ లోని సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలి’’ అని ఐటీ శాఖ స్పష్టం చేసింది..
ఆదాయపు పన్ను రిఫండ్స్ స్కామ్

ఆదాయ పన్ను (income tax) రిఫండ్స్ కు సంబంధించి జరుగుతున్న కుంభకోణం గురించి కూడా పన్ను చెల్లింపుదారులను పన్ను శాఖ హెచ్చరించింది. ‘‘రీఫండ్స్ కోసం ఎదురు చూస్తున్న వారిలో కొత్త తరహా కుంభకోణం వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. ఎస్సెమ్మెస్, మెయిల్ పంపడం ద్వారా ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొట్టేందుకు స్కామర్లు ట్యాక్స్ రీఫండ్స్ ముసుగును ఉపయోగించుకుంటున్నారు. అలాంటి మెసేజ్ లను నమ్మవద్దు’’ అని హెచ్చరించింది.
4 కోట్లకు పైగా ఐటీఆర్ ల ఫైలింగ్

2024 జూలై 22 వరకు 4 కోట్లకు పైగా ఐటీఆర్లు (ITR) దాఖలయ్యాయని, గత ఏడాది ఇదే సమయంలో దాఖలు చేసిన రిటర్న్ లతో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువని ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్ పేర్కొంది. జూలై 16 నాటికీ రోజువారీగా దాఖలైన ఐటిఆర్ల సంఖ్య 15 లక్షలు దాటింది. 2024 జూలై 31 గడువు తేదీ సమీపిస్తున్నందున రోజువారీగా దాఖలయ్యే ఐటీఆర్ ల సంఖ్య ప్రాతిపదికన మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

ఇవే టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ నంబర్లు

2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కోటి ఐటీఆర్ ల (ITR) దాఖలు మైలురాయి 2024 జూన్ 23న చేరుకోగా, జూలై 7వ తేదీన 2 కోట్ల మైలురాయిని, జూలై 16 వ తేదీన 3 కోట్ల మైలురాయిని సాధించింది. 4 కోట్ల మైలురాయిని జూలై 22 న సాధించింది. ITR ఫైలింగ్ కు సంబంధించి ఏదైనా సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారులు ఐటీ శాఖ టోల్ ఫ్రీ హెల్ప్ డెస్క్ నంబర్లను (1800 103 0025 లేదా 1800 419 0025) లేదా Efilingwebmanager@incometax.gov.in సంప్రదించవచ్చు.