ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. పీఎఫ్ విషయంలో కీలక నిర్ణయం, ఇక నో టెన్షన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, జనరల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌)లను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి.


లోపాలు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని వారు కోరారు. పెన్షనర్ల వార్షిక ధృవీకరణ ప్రక్రియను మొబైల్ ద్వారా చేసుకునే సదుపాయం కల్పించడంపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై ఈ కొత్త విధానంపై వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

ఆర్థిక శాఖ సచివాలయంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. పదవీ విరమణ ప్రయోజనాల ప్రాసెసింగ్‌ సిస్టమ్‌ (ఆర్‌బీసీ), జీపీఎఫ్‌ డిజిటలైజేషన్‌పై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఈ కొత్త విధానానికి ఆమోదం తెలిపారు. ఈ డిజిటలైజేషన్ వల్ల ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. పదవీ విరమణ తర్వాత రావాల్సిన డబ్బులు, జీపీఎఫ్‌ వివరాలు సులభంగా, వేగంగా అందుతాయి. పెన్షనర్లు తమ వార్షిక ధృవీకరణను ఇంటి నుంచే మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. దీనివల్ల కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఈ విధానం చాలా మంచిదని, అయితే దీనిని అమలు చేసేటప్పుడు ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ముఖ్యంగా, పాత విధానంలో ఉన్న సమస్యలు కొత్త విధానంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని పనులను ఒకే చోట, సులభంగా చేసుకునేలా ఒక కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులు తమ పనులను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త ప్లాట్‌ఫాం వల్ల పెన్షన్ వంటి వాటిల్లో ఆలస్యం జరిగినా, సాంకేతిక సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఇకపై ఉద్యోగులు తమ కార్యాలయంలో ఒక కామన్ అప్లికేషన్ ఫారం నింపితే చాలు. ఆ ఫారం నేరుగా అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ వరకు వెళ్లిపోతుంది. మొత్తం ప్రక్రియ అక్కడే పూర్తవుతుంది. ఉద్యోగులు తమ దరఖాస్తు ఎక్కడ వరకు వచ్చిందో మొబైల్‌లోనే చూసుకోవచ్చు.

పెన్షన్ మంజూరులో ఏమైనా ఆలస్యం జరిగితే, దానిపై ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఈ పోర్టల్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పాత పద్ధతిలో పనులు ఆలస్యం అవ్వడం, మంజూరులో ఇబ్బందులు రావడం, చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతున్నాయి. ఈ కొత్త విధానం వల్ల ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక శాఖ తీసుకొస్తున్న డిజిటలైజ్ విధానాన్ని ఆహ్వానిస్తున్నామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్రంలో పెన్షనర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇంత త్వరగా చొరవ చూపడం ఆనందంగా ఉందన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.