షారుక్ ఖాన్ పెట్టుకున్న రోలెక్స్ వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. రియాద్ లో జరిగిన జాయ్ అవార్డుల వేడుకకు షారుక్ ఈ వాచ్ పెట్టుకునే వెళ్లాడు. డైమండ్లు పొదిగిన ఈ వాచ్ గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) అంటేనే స్టైల్. అందులోనూ అతని వాచీల కలెక్షన్ అంటే ఇంకాస్త స్పెషల్. ఇటీవల రియాద్‌లో జరిగిన ‘జాయ్ అవార్డ్స్ 2026’ వేడుకలో కింగ్ ఖాన్ ధరించిన వాచ్ ఇప్పుడు వాచ్ ప్రియులనే కాదు, నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఆల్ బ్లాక్ డ్రెస్సింగ్‌లో మెరిసిన షారుక్.. చేతికి ధరించిన అల్ట్రా-రేర్ రోలెక్స్ వాచ్ ఆ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
వాచ్ ప్రత్యేకతలు ఏంటి?
షారుక్ ఖాన్ ధరించింది ‘రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా సఫైర్’ (Rolex Cosmograph Daytona Sapphire) వాచ్. ఇది రోలెక్స్ సాధారణ జాబితాలో ఉండదు. కేవలం టాప్ వీవీఐపీ క్లయింట్ల కోసం 2025లో ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆఫ్-క్యాటలాగ్’ పీస్ ఇది.
40ఎంఎం సైజులో ఉండే ఈ వాచ్‌ను 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు. దీనిపై ఏకంగా 54 బ్రిలియంట్-కట్ వజ్రాలను పొదిగారు. వాచ్ చుట్టూ ఉండే బెజెల్‌పై 36 బ్యాగెట్-కట్ బ్లూ సఫైర్స్ (Blue Sapphires) ఉన్నాయి. దీని డయల్ సిల్వర్ అబ్సిడియన్‌తో తయారు చేశారు. కాంతిని బట్టి ఇది రంగు మారుతున్నట్లు కనిపిస్తుంది.
ధర రూ. 13.5 కోట్లు..
దీన్నే ‘ఘోస్ట్’ వాచ్ అంటారు. ఈ వాచ్ ధర అక్షరాలా రూ. 13,51,26,825 (సుమారు రూ. 13.5 కోట్లు). ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వాచీలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇవి పబ్లిక్ క్యాటలాగ్‌లో కనిపించవు కాబట్టి వీటిని ‘ఘోస్ట్ వాచ్’ అని పిలుస్తారు. ఇది మ్యూజియంలలో పెట్టదగ్గ అరుదైన కలెక్షన్ అని నిపుణులు అంటున్నారు.
షారుక్ ఈ వాచ్ ధరించడం ఇదే తొలిసారి కాదు. దుబాయ్‌లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లోనూ అతడు ఇదే వాచ్‌తో కనిపించాడు. ఇక ఇదే జాయ్ అవార్డుల వేడుకలో ఓ అభిమాని తనతో సెల్ఫీ దిగడానికి ప్రయత్నించగా.. షారుక్ అతని చేతుల్లోని మొబైల్ లాక్కొన్న వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు అతనిపై విమర్శలు గుప్పించారు.
షారుక్ ఖాన్ ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.


































