వరి సాగులో విప్లవాత్మక పద్ధతికి కేరళలోని ఓ రైతు కుటుంబం శ్రీకారం చుట్టింది. సేంద్రియ వ్యవసాయంలో జపనీస్ పద్ధతి (Japanese Farming Method)తో కృష్ణ అనే రైతు ఔరా!
అనిపిస్తున్నారు. ప్రజలకు తినే ఆహారాన్ని రసాయన ఎరువులతో పండించడం వల్ల మనకు తెలియకుండానే వారికి నష్టాన్ని కలిగిస్తున్నామని.. అలాంటి పొరపాటు చేయొద్దనే ఆలోచనతోనే సహజ పద్ధతుల్లో వరి పండించడానికి (Paddy Farming) తాను జపనీస్ సేంద్రీయ వ్యవసాయ పద్ధతిని (Fukuoka farming method) ఎంచుకున్నానన్నారు. ఈ పద్దతిలో భూమిని చదును చేయడం, కలుపు తీయడం, ఎరువులు, పురుగు మందుల్లేకుండా సహజమైన రీతిలో వరిని పండిస్తున్నట్లు ‘ఈటీవీ భారత్’కు వివరించారు. జర్మనీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే తన కుమారుడు అశ్విని అల్వా దీని (Fukuoka farming method) గురించి చెప్పడంతో ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టానన్నారు. తొలుత స్థానికుల నుంచి అవహేళన ఎదురైనా అవేవీ పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో కృషి భవన్, పంచాయతీ నుంచి పూర్తి సహకారం అందిందన్నారు.
ఏమిటీ టెక్నాలజీ.. ఉత్పాదకత ఎంత?
ఈ (Fukuoka) వ్యవసాయ పద్ధతిలో విత్తనం నాటడం నుంచి కోత వరకు అన్ని పద్ధతులూ విభిన్నంగానే ఉంటాయి. Fukuoka విధానమనేది జపాన్‌కు చెందిన మసనోబు అనే మైక్రోబయాలజీ శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన సహజ వ్యవసాయ పద్ధతి.
1. దీంట్లో తొలుత విత్తనాలను నీళ్లలో నానబెట్టాలి.
2. మూడు రోజులపాటు అవి నానిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఆ తర్వాత మట్టిని చిన్న గుళికల్లా చేసి రెండు లేదా మూడు విత్తనాలను వాటిలో వేసి.. మట్టిలో ఉంచుతారు. (ఇలా చేస్తే పక్షులు, చీమల నుంచి విత్తనాలకు రక్షణ ఉంటుంది.)
సాగు గురించి: ఉపాధి కూలీలతో పొలం చదును చేసి.. విత్తనాలు నాటడం ఒక ప్రత్యేక పద్దతిలో చేపట్టారు. విత్తనాలను మూడు రోజుల పాటు నీటిలో నానబెట్టి.. ఆ తర్వాత పక్షులు, చీమల నుంచి రక్షణగా మట్టి గుళికలలో ఉంచుతారు. ఉత్పాదకత విషయానికి వస్తే.. ఒక వరి కాడ దాదాపు 500 వరి గింజల వరకు ఉత్పత్తి చేయగలదని రైతు చెబుతున్నారు. పొలంలో గడ్డి ఉన్నప్పటికీ.. తెగుళ్లు పెద్ద సమస్య కాదని, ఇక్కడి వాతావరణం జపాన్‌తో పోలి ఉండటంతో ఈ కొత్త పద్దతికి బాగా నప్పుతుందని తన కుమారుడు చెప్పినట్లు కృష్ణ తెలిపారు. మరోవైపు, వరిపైరు బాగా పెరగడంతో త్వరలోనే కోతకు సిద్ధమవుతున్నారు. వరి కాడలను మాత్రమే కోసి.. మిగిలిన దుబ్బులన్నీ ఎండిపోయి, సహజంగా కుళ్లేలా చేసి భూమిని మరింత సారవంతంగా మార్చాలని చూస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, దీన్ని మరిన్ని పొలాలకు విస్తరించాలని రైతు లక్ష్యంగా పెట్టుకున్నారు.
సక్సెస్ అయితే.. ఓ విప్లవమే!
”ప్రకృతి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ద్వారా కలుపు తీత, పురుగుమందుల అవసరం ఉండదు. ఎందుకంటే.. ప్రకృతి సమతుల్యత తెగుళ్లు, మొక్కలను నియంత్రిస్తుంది. ఇది నేలను సారవంతం చేసి జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో దోహదపడుతుంది” అని రైతు కృష్ణ తెలిపారు. ఈ వినూత్న సాగు విధానంపై రైతుకు ఉచితంగా తన రెండుకరాల భూమిని కౌలుకు ఇచ్చిన అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. ‘ఇది విజయవంతమైతే.. ఓ విప్లవమే’ అని పేర్కొన్నారు.
కృష్ణ ఓ ఆదర్శ రైతు.. వ్యవసాయ అధికారి
కాలుష్యరహిత ఆహారం విషయంలో కేరళ పెద్ద సవాల్‌నే ఎదుర్కొంటోందని స్థానిక వ్యవసాయాధికారి దినేశ్ అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పద్ధతికి ఎలాంటి ఎరువులు, పురుగుమందులు అవసరం లేదని, పంట తర్వాత ఎలాంటి వ్యర్థాలూ వెలువడవన్నారు. కృష్ణ ఓ ఆదర్శ రైతు అని కొనియాడిన సదరు అధికారి.. పలు సలహాలు ఇచ్చి ఆయన్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు, అక్కడి వ్యవసాయ శాఖ సైతం ఈ తరహా సుస్థిర వ్యవసాయ పద్ధతుల్లో పంటల సాగు కోసం నిరుపయోగంగా ఉన్న భూములను గుర్తిస్తున్నట్లు సమాచారం.
































