AP Politics: త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?

అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది..!


ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఇంత పెద్ద మాటలు అన్నది మరెవరో కాదు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రమాణం చేసిన ఆయన.. లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలే చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని.. హైకమాండ్ వద్దంటున్నా సరే ఒత్తిడి తెస్తున్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. తనతో పాటు తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆదినారాయణ రెడ్డి బాంబ్ పేల్చారు. అంతటితో ఆగని ఆయన.. వైఎస్ ఫ్యామిలీపై కూడా గట్టి ఆరోపణలే చేశారు.

వైఎస్ ఫ్యామిలీపై ఇలా..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. సమావేశంలో జగన్ ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావనకు తెచ్చిన ఆదినారాయణ రెడ్డి.. ఓదార్పు యాత్ర కోసం జగన్ మళ్లీ 14 కారణాలు వెతుక్కుంటున్నారని సెటైర్లేశారు. ఏ దారి దొరక్కపోతే బాధితులను సృష్టించుకుంటారని.. చెల్లి వైఎస్ షర్మిల వల్లనే నష్టపోయామని జగన్ తెలుసుకున్నారని ఆరోపించారు. అంతేకాదు.. చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని తల్లిని కోరారన్నారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సంచలనానికి తెరదీశాయి. అయితే.. షర్మిల ఒప్పుకోలేదని అన్న వైఎస్ జగన్ రెడ్డినే వచ్చి కాంగ్రెస్‌లో చేరాలని చెప్పినట్లు కూడా ఆదినారాయణ చెప్పుకొచ్చారు.

ఉప ఎన్నికపై..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని.. అది కూడా అతి త్వరలోనే ఉంటుందని ఆదినారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ అరెస్ట్ తర్వాత కడప లోక్‌సభకు ఉప ఎన్నిక జరుగుతుందన్నారు. ఈ బై పోల్‌లో టీడీపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఆ గెలిచే వ్యక్తి భూపేశ్ రెడ్డి అని కూడా పనిలో పనిగా చెప్పేశారాయన. కాగా.. 2024 ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల.. టీడీపీ నుంచి భూపేశ్ సుబ్బరామిరెడ్డి పోటీ చేశారు. అయితే 62,695 ఓట్ల మెజార్టీతో అవినాష్ గెలిచి నిలిచారు. దీంతో ఈయన హ్యాట్రిక్ కొట్టినట్లయ్యింది. కాగా.. 2014 ఎన్నికల్లో 190,323 ఓట్ల మెజార్టీతో, 2019 ఎన్నికల్లో ఈ ఆరోపణలు చేసిన ఆదినారాయణ రెడ్డిపై 380,726 ఓట్ల మెజార్టీతో గెలిచారు అవినాష్. అయితే ఈసారి షర్మిల పోటీ చేయడం.. టీడీపీ టఫ్ ఫైట్ ఇవ్వడంతో కేవలం 62,695 ఓట్ల మెజార్టీకే పరిమితం అయ్యారు. అయినా అదిగో అరెస్ట్.. ఇదిగో అవినాశ్ అరెస్ట్ అని సుమారు ఐదేళ్లుగా నడుస్తూనే ఉంది తప్ప.. అదేమీ జరగలేదు. చూశారుగా.. ఇది ఆదినారాయణ రెడ్డి చెప్పిన జోస్యం. ఇది ఎంతవరకు నిజం అవుతుందో.. ఏంటో చూడాలి మరి.