Kangana Ranaut: కంగనాను కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

గత నెలలో చండీగఢ్‌ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ను కుల్విందన్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.


ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాను కొట్టినట్లు సదరు కానిస్టేబుల్ వెల్లిడించింది. బీజేపి ఎంపీ ఫిర్యాదుతో కుల్విందర్ పై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయగా.. సిట్ దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఈ ఘటనలో పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు కుల్విందర్ కు మద్దతు తెలుపగా.. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆమెకు ఏకంగా ఉద్యోగం ఇస్తామంటూ ఇన్ స్టా వేదికగా ఆఫర్ ఇచ్చాడు. దీంతో తనకు సపోర్ట్ చేయని వారిపై మండిపడింది కంగనా.

ఇదంతా పక్కన పెడితే కంగనాపై చేయి చేసుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ పై సస్పెషన్ వేటు వేసిన అధికారులు తిరిగి ఆమెను విధుల్లోకి తీసుకున్నారు. అంతేకాకుండా ఆమెపై బదిలీ వేటు వేశారు. కుల్విందర్ ను చండీగఢ్ నుంచి బెంగుళూరు రూరల్ జిల్లా నేలమంగళ తాలూకాలోని డాబస్ టౌన్ సమీపంలోని సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్సుకు ఆమెను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం కుల్విందర్ సస్పెన్షన్ లో ఉన్నారు.

బీజేపీ ఎంపీ కంగనాను చెంప దెబ్బ కొట్టిన ఆరోపణలపై సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌పై శాఖాపరమైన విచారణ జరుగుతోందని సీఐఎస్‌ఎఫ్ తెలిపింది. దేశంలో రైతులు చేసిన ఉద్యమాన్ని కించపరుస్తూ కంగనా మాట్లాడారని.. ఆ రైతులలో తన తల్లి కూడా ఉన్నారని.. అందుకే కంగనాపై చేయి చేసుకున్నానంటూ కుల్విందర్ తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రెటీస్ కుల్వింద్ కు మద్దతు తెలిపారు.