వాహనదారులకు గుడ్ న్యూస్. ఇకపై హైవే ప్రయాణం మరింత సులభం కానుంది. అంతేకాక ఫాస్టాగ్ లో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమనట్లు తెలుస్తోంది.
సంవత్సరంలో ఒకేసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లించి.. అన్ లిమిటెడ్ హైవే ప్రయాణం చేసేందుకు వీలుగా ఓ కొత్త పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విధానంతో వాహనదారుల ప్రయాణం సులభతరం కావడంతోపాటు.. ఇష్టం ఉన్న ప్రదేశాలకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ప్రయాణం చేసే వీలుంటుంది.
టోల్ ప్లాజాల వద్ద నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనదారులు గంటల కొద్దీ నిరీక్షణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఫాస్టాగ్ విధానంలో కీలక మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమనట్లు తెలుస్తోంది. కొత్త పాలసీలో ముఖ్యంగా రెండు పద్ధతులను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
యాన్నువల్ పాస్ పద్ధతి.. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఫాస్టాగ్ ఫీజు చెల్లిస్తే.. సంవత్సరం మొత్తం అన్ లిమిటెడ్ హైవే జర్నీ చేయొచ్చు. సంవత్సరం ఫీజు రూ. 3000 గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఫీజు ఒకేసారి చెల్లిస్తే టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అడ్డంకులు ఉండవు. దేశంలోని ఏ ప్రాంతానికైనా హైవేపై దర్జాగా ప్రయాణించవచ్చు. ఎలాంటి అదనపు డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం లేదు. రెండు.. మీరు వెళ్లే దూరాన్ని బట్టి ఫాస్టాగ్ ఫీజు చెల్లించవచ్చు. ప్రతి 100 కి.మీ రూ. 50 చెల్లించే విధంగా రూల్స్ పెట్టారు.
ఈ కొత్త పాలసీని తీసుకురావడానికి గల కారణం దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో ఒక్కో మార్పు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే మే 1, 2025 నుంచి దేశంలో టోల్ కలెక్షన్ విధానంలో సంచలన మార్పును అమల్లోకి తెచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంతో పారదర్శకమైన టోల్ వసూళ్లు జరుగుతాయని అధికారులు చెప్తున్నారు.
































