కళలు, సాహిత్యం, సామాజిక సేవ, వైద్యం, విద్య, ప్రజాసేవ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలలో విశిష్ట, దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిన వ్యక్తులను ఈ అవార్డులతో సత్కరిస్తారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు అవార్డులు పొందినవారి పేర్లను ప్రకటించారు. పద్మ అవార్డులు భారత రత్న తర్వాత దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. వీటిని పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాలలో ఇస్తారు. 2026 సంవత్సరానికి 131 పద్మ అవార్డులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.
ఉదయ్ కోటక్‌కు పద్మభూషణ్
పరిశ్రమలు, వాణిజ్యం విభాగంలో వ్యాపారవేత్త, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్‌కు దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ను భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ దాస్ ఆఫ్‌షోర్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ అశోక్ ఖాడే, టీటీకే గ్రూప్ చైర్మన్ (ఎమెరిటస్) టీటీ జగన్నాథన్‌లకు పద్మశ్రీ పురస్కారాల జాబితాలో చోటు దక్కింది. దేశీయ ప్రఖ్యాత వంటసామాను బ్రాండ్లలో ఒకటిగా ప్రెస్టీజ్‌ను తీర్చిదిద్దిన టీటీ జగన్నాథన్ గతేడాది అక్టోబర్‌లో మరణించారు.

































