భారత్‌కు కుబేరులు బై బై

భారత కుబేరుల్లో కనీసం 22 శాతం మంది దేశం వీడాలనుకుంటున్నారట. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే), ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో స్థిరపడాలనుకుంటున్నారు. గోల్డెన్‌ వీసా స్కీమ్‌ ఆఫర్‌ చేస్తున్న యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వలస పోయేందుకు కూడా మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా జీవన స్థితిగతులు అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు ఇతర దేశాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు, సులభతర వ్యాపార వాతావరణం వంటి అంశాలు ఇందుకు ప్రధాన కారణమని ప్రముఖ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవల కంపెనీ కోటక్‌ ప్రైవేట్‌.. అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సేవల కంపెనీ ‘ఈవై’తో కలిసి చేపట్టిన సర్వేలో వెల్లడైంది. 150 మంది అత్యంత సంపన్నుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. ఏటా 25 లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలసపోతున్నారని ఆ నివేదికలో తెలిపారు. సర్వే ఇతర ప్రధానాంశాలు…


ప్రతి ఐదుగురు అలా్ట్ర హై నెట్‌వర్త్‌ ఇండివిజువల్స్‌లో (యూహెచ్‌ఎన్‌ఐ) ఒకరు దేశం వీడే ఆలోచనలో ఉన్నారు. అయితే, భారత పౌరసత్వం కొనసాగిస్తూనే తమకు నచ్చిన దేశంలో ఉండిపోవాలనుకుంటున్నారు.

మెరుగైన జీవన, విద్యా ప్రమాణాలు, ఆరోగ్య సేవల కారణంగా మన శ్రీమంతులు ఇతర దేశాల వైపు ఆకర్షితులవుతున్నారు. సాఫీగా వ్యాపారం చేసుకోగలిగే వాతావరణం మరో ప్రధాన కారణమని సర్వేలో పాల్గొన్న మూడింట రెండొంతుల మంది తెలిపారు.

తమ వలస నిర్ణయాన్ని భవిష్యత్‌పై పెట్టుబడిగా వారు భావిస్తున్నారు. తమ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న కారణంగానూ వారు వలస పోవాలనుకుంటున్నారు.

పారిశ్రామికవేత్తలు, వారసత్వంగా సంపద లభించిన వారితో పోలిస్తే వృత్తి నిపుణులు ఇతర దేశాల్లో స్థిరపడేందుకు అధికంగా మొగ్గు చూపుతున్నారు. వయసు పరంగా చూస్తే, 36-40 ఏళ్ల వారితోపాటు 61 ఏళ్లకు పైబడిన శ్రీమంతులు ఇందుకు అధిక ఆసక్తి కనబరిచారు.

శ్రీమంతుల వలసలను మూలధన తరలింపుగా చూడవద్దని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ గౌతమి గవాంకర్‌ అన్నారు. దేశంలోనే నివసిస్తున్న భారత పౌరులు ఏటా 2.50 లక్షల డాలర్ల (రూ.2.15 కోట్లు) వరకే బయటి దేశాలకు తరలించగలరు. ప్రవాస భారతీయులు మాత్రం గరిష్ఠంగా 10 లక్షల డాలర్లు (రూ.8.57 కోట్లు) వరకు తీసుకెళ్లవచ్చన్నారు.