వర్షపు నీటితో వాగును తలపిస్తున్న ఒంగోలులోని కర్నూల్‌ రోడ్డు

జిల్లాపై వాయుగుండం ప్రభావం తీవ్రంగానే ఉంది. ప్రత్యేకించి తూర్పు, దక్షిణ ప్రాంతంలో ముసురుపట్టి వర్షం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఒంగోలు నగరంలో భారీ వర్షం కురవడంతో శివారు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లు తటాకాలను తలపించాయి. మరోవైపు పశ్చిమ ప్రాంతంలో పంటలకు ప్రతికూల పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పత్తి, మిర్చి దెబ్బతింటున్నాయని, ఇంకా వర్షం ఎక్కువైతే ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. తీరప్రాంతంలో పర్యటించి మత్స్యకారుల బోట్లు, వలలను ఒడ్డుకు చేర్చుకోవాలని సూచించారు.


జిల్లాలో ఈశాన్య రుతుపవనాల కారణంగా పది రోజులుగా జల్లులు పడుతున్నాయి. ఈక్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షం ప్రారంభమై మంగళవారం రాత్రి, తిరిగి బుధవారం పగటి పూట కూడా విస్తారంగా జల్లులు పడ్డాయి. తెరపి లేకుండా ప్రతి గంటకు ఏదో ఒకస్థాయిలో జల్లులు పడుతూనే ఉండటం ప్రజానీకానికి తీవ్ర ఇబ్బంది కలిగించింది. అలా సోమవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 42 గంటల వ్యవధిలో జిల్లాలో 53.0 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అందులో మంగళ వారం ఉదయం 8.30 నుంచి బుధవారం ఉదయం 8.30 వరకు 24 గంటల్లోనే 26.9 మి.మీ కురిసింది. బుధవారం పగటి పూట ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య దాదాపు 17.7 మి.మీ పడింది.

పొంగిన వాగులు

అల్పపీడన ప్రభావంతో 42గంటల్లో 53.0 మి.మీ వర్షం పడ టంతో అన్ని ప్రాంతాల్లోనూ నీటి ప్రవాహాలు పెరిగాయి. ఈ వ్యవ ధిలో గరిష్ఠంగా కొత్తపట్నం మండలంలో 124.0, ఒంగోలు అర్బ న్‌లో 107.8, ఒంగోలు రూరల్‌లో 107.3, సింగరాయకొండలో 106.0, సీఎస్‌పురంలో 95.3, వెలిగండ్లలో 92.0, పామూరులో 86.4 మి.మీ వర్షపాతం నమోదైంది. పశ్చిమప్రాంతంలోని కొన్ని మండలాలు మినహా అత్యధిక ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రత్యేకించి జిల్లా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోని ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, కనిగిరి నియోజకవర్గాల్లో విస్తారంగా పడ్డాయి. దీంతో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. నాగులుప్పలపాడు మండలం కొత్తకోట వాగు, ఒంగోలు-మంగమూరు మధ్య నల్లవాగు, పామూరు మండలంలోని దుప్పలి వాగులు పొంగి ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచాయి. పలు ఇతరచోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఒంగోలులో తెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రజలు అవస్థ పడ్డారు. నగరంలోని ప్రఽధాన వీధుల్లో చెరువులను తలపించేలా నీరు పారగా శివారు కాలనీలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లోనూ లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం, ముసురు వానతో రోడ్లు ఛిద్రమై గ్రామీణ ప్రజలు అవస్థలు పడ్డారు.

రైతుల్లో ఆందోళన

ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని పశ్చిమప్రాంతంలో విస్తారంగా పంటలు సాగు చేశారు. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి, కంది, మొక్కజొన్న, సజ్జ వంటి పంటలు వేయగా వాటిలో వరి మినహా అన్నీ పంట దశకు వచ్చాయి. వాటికి తాజా వర్షం ప్రతికూలంగా మారింది. సుమారు 33వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మిర్చి జిల్లాలో సాగు కాగా అందులో దాదాపు 90 శాతం పశ్చిమప్రాంతంలోనే వేశారు. ప్రస్తుత వర్షాలకు చాలాచోట్ల పొలాల్లో నీరు చేరి మొక్కలు ఉరకెత్తిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పత్తి పంట సుమారు 45వేల ఎకరాల్లో సాగు చేయగా అది కూడా అత్యధికంగా ఆ ప్రాంతంలోనే ఉంది. ప్రస్తుతం పత్తి పంట కాయ, తీతల దశలో ఉండగా వర్షాలతో కాయలు కుళ్లిపోయే అవకాశం ఉంది. పత్తి తడిచి పనికిరాకుండా పోయి రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. సజ్జ పంట కోత దశకు రాగా వర్షాలతో తేమ అధికమై కంకులు బూజుపట్టి చేతికి అందకుండా పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కంది కూడా ఏపుగా పెరిగే సమయం కాగా తాజా వర్షాలతో మరింతగా మొక్కలు పెరిగి కాపు రాకుండా పోతుందని చెప్తున్నారు. ప్రస్తుత వాతావరణంతో అన్నిరకాల పంటల్లోనూ తెగుళ్లు, కలుపు అధికం కానున్నాయి. పశ్చిమప్రాంతంలో వ్యవసాయశాఖ అధికారులు పొలాల్లో తిరిగి పంటలను పరిశీలించి రైతులకు జాగ్రత్త చర్యలపై సూచనలు ఇస్తున్నారు.

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

ఇప్పటికే జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండటమే కాక బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్రప్రభావం చూపుతుందన్న సంకేతాలతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యారు. జిల్లా మంత్రి డాక్టర్‌ స్వామి తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలోనే ఉండి కలెక్టర్‌, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌ ఇతర శాఖల అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తూ తగు సూచనలు చేశారు. గత రాత్రి అందరూ అధికారులను అప్రమత్తం చేసిన కలెక్టర్‌ రాజాబాబు బుధవారం సింగరాయకొండ మండలంలో పర్యటించారు. ఒంగోలులో మేయర్‌ గంగాడ సుజాత, నగర కమిషనర్‌ వెంకటేశ్వరరావు, అర్బన్‌ తహసీల్దార్‌ మధుసూదన్‌లు శివారు కాలనీల్లో పర్యటించి ఉపశమన చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే జనార్దన్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి కార్పొరేషన్‌ అధికారులు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులతో మాట్లాడి అప్రమత్తం చేశారు.

శిబిరాల ఏర్పాటుపై దృష్టి

వర్షం అధికమైతే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా శిబిరాలు ఏర్పాటుపై కూడా అధికారులు దృష్టి సారించారు. అధికారుల సూచనలతో తీరప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా వలలు, పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. జేసీ గోపాలకృష్ణ ఒంగోలు రూరల్‌ మండలం ముదిగొండి వాగు ఉధృతిని పరిశీలించారు. జిల్లాలో వాయుగుండం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉండగా బుధవారం పగటిపూట వర్షం ఎక్కువగా పడటంతో ఒంగోలు నగరంతోపాటు తీరప్రాంతం అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో పాఠశాలలకు మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.