Loan Foreclosure: చాలా మంది నేటి కాలంలో తమ ఆర్థిక అవసరాలు, ఇతర కోరికల కలలను తీర్చుకునేందుకు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే వీటి చెల్లింపులకు సంబంధించిన విషయంలో రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన నియమ నిబంధనలు చాలా తక్కువ మందికి ఇప్పటికీ తెలియవు.
హోమ్ లోన్ నుంచి బిజినెస్ లోన్ వరకు అవసరానికి అనుగుణంగా బ్యాంకులు వ్యక్తులకు సులువుగా లోన్స్ నేటి కాలంలో అందిస్తున్నాయి. అయితే సమయానికి వీటి ఈఎంఐలు చెల్లించటం ఒక పెద్ద బాధ్యతని తెలిసిందే. కొంత మంది హోమ్ లోన్ లాంటి దీర్ఘకాలిక రుణాల విషయంలో వీలైనంత త్వరగా చెల్లించాలని ప్లాన్ చేస్తుంటారు. గడువుకు ముందే లోన్ ఫోర్‌క్లోజర్ చేస్తుంటారు. కొన్ని బ్యాంకులు దీనికి అదనపు చార్జీలు వసూలు చేస్తుంటాయి.
చాలా మంది రుణాల విషయంలో బయపడుతుంటారు. సమయానికి చెల్లింపులు చేయగలమా లేదా అని ఆందోళన చెందుతుంటారు. అందుకే గడువుకు ముందే డబ్బు కూడబెట్టి వాటిని తిరిగి చెల్లించాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయని చాలా మందికి తెలియదు. వాస్తవానికి, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు, వ్యాపార రుణాలు, బైక్ రుణాలు, కారు రుణాలు వంటి రకాలు కూడా లోన్ ఫోర్‌క్లోజర్ ఆప్షన్ కలిగి ఉంటాయి. రుణాన్ని ముందుగా చెల్లించినందుకు క్లోజర్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్‌బీఐ నిబంధనలు చెబుతున్నాయి. మీరు ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాన్ని తీసుకున్నట్లయితే.. RBI వడ్డీ రేటును మార్చడంతో మీ రుణంపై వడ్డీ రేటు మారుతుంది. కాబట్టి ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్‌తో మీరు ముందస్తుగా తిరిగి చెల్లించాలనుకుంటే ఎలాంటి ముందస్తు క్లోజర్‌కు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే క్రమంలో మీరు టర్మ్‌కు ముందు అంటే ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో రుణం తీసుకున్నప్పుడు దానిని మూసివేయాలనుకుంటే లోన్ క్లోజర్ ఛార్జీలు చెల్లించాలి.
ముందస్తు రుణ చెల్లింపులకు ఎందురు ఛార్జీలు బ్యాంకులు వసూలు చేస్తాయనే అనుమానం మనలో చాలా మందికి ఉంటూనే ఉంటుంది. రుణగ్రహీత గడువు తేదీకి ముందే రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించినట్లయితే.. అతనిపై రుణ బాధ్యత తీసివేయబడుతుంది. అయితే దీని వల్ల బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లుతోంది.
కాబట్టి రుణగ్రహీత గడువు తేదీకి ముందే రుణాన్ని తిరిగి చెల్లిస్తే, బ్యాంకులు లోన్ ఫోర్క్లోజర్ ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది మీరు చెల్లించాల్సిన బకాయి బ్యాలెన్స్‌లో 5% వరకు ఉంటుంది. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు దీనికి సంబంధించిన నియమాలను పత్రాల్లో పొందుపరుస్తాయి. అందువల్ల లోన్ తీసుకునే సమయంలోనే ఫోర్ క్లోజర్ రూల్స్ అడిగి తెలుసుకోవటం ఉత్తమం.