30న 4లక్షల మంది రైతులకు రుణమాఫీ

www.mannamweb.com


బ్యాంకు ఖాతాల్లోకి ‘బోనస్‌’ జమ కూడా

వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా

కొహెడ వద్ద అతిపెద్ద మోడల్‌ మార్కెట్‌

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన

షాద్‌నగర్‌ /షాద్‌నగర్‌ అర్బన్‌ నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీ అమలు కోసం ఎదురుచూస్తోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన 4 లక్షల మంది రైతులకు సంబంధించిన మాఫీని మహబూబ్‌నగర్‌ వేదికగా శనివారం(30వ తేదీ) జరిగే రైతు పండగ కార్యక్రమంలో అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే, సన్నరకాల ధాన్యంకు సంబంధించి రైతులకు ఇస్తామన్న రూ.500 బోన్‌సను కూడా అదే రోజున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని, ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అధ్యక్షతన బుధవారం జరిగిన షాద్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని, అందుకే బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. మహబూబ్‌నగర్‌ వేదికగా మూడు రోజులు పాటు జరిగే రైతుల పండగ కార్యక్రమంలో భాగంగా ఆఖరి రోజు చేపట్టనున్న రైతు రుణమాఫీ, బోనస్‌ జమ అంశాలను వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలన్న సంకల్పంతో సీఎం ఉన్నారని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా కొహెడలో రూ.2వేల కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్‌ మార్కెట్‌ను నిర్మించబోతున్నామన్నారు. తెలంగాణలో ఉత్పత్తయ్యే ధాన్యానికి విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉందని, నన్న బియ్యం ఎగుమతి చేయాలని మలేషియా, ఫిలిపిన్స్‌ తదితర దేశాలు కోరుతున్నాయన్నారు. రైతు పండగ కార్యక్రమం ద్వారా ఆధునిక సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు రూ.50వేల కోట్లు బాకీ పడగా అందులో రూ.12వేల కోట్లను తమ ప్రభుత్వం తీర్చిందని మంత్రి తెలిపారు. మిగిలిన మొత్తాన్ని విడతల వారీగా తీరుస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన కీలక పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం ఎంత ధాన్యం కొనుగోలు చేసింది ? ఎంతమంది మిల్లర్లకు విక్రయించింది ? తదితర వివరాలు తెలిపే పత్రాలు లేవన్నారు. ఇక, సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజవర్గ అభివృద్ధికి పారిశ్రామిక కారిడార్‌ ప్రకటిస్తే బీఆర్‌ఎస్‌ నేతలు లగచర్లలో కలెక్టర్‌ సహా అధికారులపై దాడులు చేయడం హేయమని విమర్శించారు.