కోడి గుడ్డు మసాలా కర్రీ ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

రోజూ గుడ్డు తినండి..ఆరోగ్యంగా ఉండండి అని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. కోడి గుడ్డులో ప్రోటీన్, విటమిన్లు సహా ఇతర పోషకాలున్నాయి. దీనిని తినడం వలన ఆరోగ్యానికి మేలు. అందుకనే కోడి గుడ్డుని పచ్చిగా కొందరు తింటారు. మరికొందరు రకరకాల కూరలు తయారు చేసుకుంటారు. ఈ రోజు కోడి గుడ్డు మసాలా కూర తయారీ గురించి తెలుసుకుందాం..

గుడ్డు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుడ్డు తినడం ఇష్టం ఉన్నవారు ఉడికించి తింటారు. లేదంటే ఆమ్లెట్‌ వేసుకుని తింటారు. ఇలా ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్లు తినడానికి విసుగు చెందితే.. గుడ్డుని కర్రీగా కూడా తయారు చేసుకోవచ్చు. గుడ్లతో చాలా టేస్టీగా కోడి గుడ్డు మసాలా కర్రీని తయారు చేసుకోండి. ఇది అన్నంతోనే కాదు చపాతీతో, దోసతో తిన్నా చాలా బాగుంటుంది. ఈ రోజు మసాలా కోడి గుడ్డు కర్రీ తయారుచేసే రెసిపీ తెలుసుకుందాం.


కావాల్సిన పదార్దాలు

  1. గుడ్లు – 4-5 (ఉడికించినవి)
  2. ఉల్లిపాయలు – 2 మీడియం సైజు(సన్నగా తరిగిన ముక్కలు)
  3. టమోటాలు – 2 మీడియం సైజు(సన్నగా తరిగిన ముక్కలు లేదా ప్యూరీ)
  4. అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
  5. పచ్చిమిర్చి – 1-2 (సన్నగా తరిగినవి)
  6. కరివేపాకు – 8-10 ఆకులు
  7. జీలకర్ర – 1 స్పూన్
  8. ఆవాలు – ½ స్పూన్
  9. లవంగాలు- 2-3
  10. యాలకులు – 2
  11. దాల్చిన చెక్క – 1 చిన్న ముక్క
  12. పసుపు – ½ స్పూన్
  13. కారం – 1 టీస్పూన్ (రుచికి సరిపడా )
  14. ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
  15. గరం మసాలా – ½ స్పూన్
  16. ఉప్పు – రుచి ప్రకారం
  17. నూనె – 4 టేబుల్ స్పూన్లు
  18. కొత్తిమీర – ఒక చిన్న కట్ట

తయారీ విధానం:

ముందుగా గుడ్లను ఉడకబెట్టండి. ఆ తర్వాత వాటిని చల్లటి నీటిలో వేసి తొక్క తీయండి. ఇప్పుడు మసాలా గుడ్డు లోపలికి వెళ్ళేలా ఫోర్క్ సహాయంతో గుడ్లకి చిన్నగా రంధ్రాలు చేయండి.

ఇప్పుడు ఒక కడాయి లేదా పాన్ ని స్టవ్ మీద పెట్టి.. నూనె వేసి వేడి చేసి.. జీలకర్ర, ఆవాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి.. వాటిని వేయించండి. తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.

ఉల్లిపాయ బంగారు రంగులోకి మారిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేయించాలి. ఇప్పుడు టమోటా ముక్కలు, ఉప్పు వేసి టమోటాలు మెత్తబడే వరకు ఉడికించండి.

టమోటాలు బాగా వేగిన తర్వాత ఆ మిశ్రమంలో పసుపు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించండి. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

మసాలా వేయించిన తర్వాత ఈ టమాటా మిశ్రమంలో కప్పున్నర నీరు పోసి ఈ మిశ్రమాన్ని కలిపి మరిగించండి. ఆ తర్వాత ఉడికించిన గుడ్లను వేసి మూతపెట్టి మీడియం మంట మీద 8-10 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఈ మసాలా గుడ్లకు పడుతుంది.

10 నిమిషాల తర్వాత మూత తీసి చివరగా గరం మసాలా పొడి వేసి మరో 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించండి. గ్రేవీ దగ్గరగా వచ్చి నూనె కూర నుంచి విడిపడిన తర్వాత గ్యాస్ ఆపి కట్ చేసిన కొత్తిమీర వేసి అలంకరించి మూత పెట్టండి. అంతే ఎంతో రుచికరమైన కోడి గుడ్డు మసాలా కర్రీ రెడీ.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.