ఏడాది మొత్తం కాసే మామిడి చెట్లు- తుపాను వచ్చినా రాలవట! విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్- కేజీ ధర?

Special Mango Tree in Rajasthan : సాధారణంగా మామిడి కాయలు అనగానే వేసవి కాలంలో కాస్తాయి అనుకుంటాం. అయితే రాజస్థాన్​లోని కోటాకు చెందిన ఓ రైతు మాత్రం, ఏడాది మొత్తం మామిడి కాయలు కాసే చెట్లను పెంచి మంచి లాభాలను అర్జిస్తున్నాడు. ఆ మామిడి చెట్లకు విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్ ఉండడం వల్ల అమెరికా, కెనడా వంటి దేశాలకు ఎగుమతి చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. మరెందుకు ఆలస్యం ఆ మామిడి చెట్లు గురించి తెలుసుకుందాం.


రాష్ట్రపతుల నుంచి సత్కారం
కోటా జిల్లాలోని గిర్ధర్‌పురా గ్రామానికి చెందిన శ్రీకృష్ణ సుమన్ అనే రైతు తన తోటలో సతత హరిత రకానికి చెందిన మామిడి చెట్లను పెంచుతున్నాడు. ఈయన ఇచ్చిన మామిడి చెట్లు రాష్ట్రపతి భవన్​లోని మొఘల్ గార్డెన్‌లో కూడా ఉన్నాయి. సతత హరిత రకానికి చెందిన మామిడి చెట్ల అభివృద్ధికి సుమన్ చేసిన కృషిని అభినందిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2023లో ఆయనను సత్కరించారు. అలాగే 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ మంత్రులు, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా సుమన్​ను సత్కరించాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మామిడి చెట్ల సాగులో సుమన్ చేసిన కృషికి రూ.లక్ష ప్రోత్సహాకాన్ని సైతం అందించింది.

పేటెంట్ కోసం దరఖాస్తు
భారత్​లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమన్ మామిడి చెట్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకు కారణం ఈ మామిడి చెట్లు ఏడాది పొడవునా మామిడి కాయలు కాయడమే. చాలా మంది విదేశీయులు, ఎన్ఆర్ఐలు సుమన్ వద్ద నుంచి మామిడి చెట్లను తీసుకెళ్లారు. ప్రస్తుతం సుమన్ తన మామిడి వెరైటీపై పేటెంట్​ను పొందేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు.
“నేను 1998లో మామిడి సాగు ప్రారంభించాను. ఆ తర్వాత ఏడాది పొడుగునా మామిడి పండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వినూత్నంగా ప్రయత్నించా. అప్పుడు 2015లో ఏడాదికి మూడుసార్లు మామిడి కాయలను ఇచ్చే చెట్లను తీర్చిదిద్దా. 2017లో అన్ సీజన్​లో మామిడి పండ్లను విక్రయించడం ప్రారంభించా. ప్రస్తుతం సీజన్​లో కేజీ మామిడి పండ్లు రూ.40- రూ.60 వరకు విక్రయిస్తున్నాను. సాధారణ మామిడి పండ్ల ధరతో పోలిస్తే వీటి ధర కేజీకి రూ.10- రూ.15 వరకు అదనంగా ఉంటుంది. అన్ సీజన్​లో ఈ మామిడి పండ్లు కేజీ రూ.200 వరకు పలుకుతాయి. దేశ, విదేశాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చి నా వద్ద మామిడి మొక్కలు తీసుకెళ్తారు. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 25 వేల మొక్కలను పెంచి విక్రయించాను. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, హరియాణా, పంజాబ్, చండీగఢ్ సహా పలు రాష్ట్రాలకు చెందినవారికి మొక్కలు విక్రయించాను. అమెరికా, జర్మనీ, దుబాయ్, కెనడా, ఇరాక్, ఇరాన్, ఆఫ్రికన్ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, రైతులు మొక్కలను తీసుకెళ్లారు. ”

– శ్రీకృష్ణ సుమన్, మామిడి సాగు రైతు

విదేశాలకు సరఫరా
తుపానుల సమయంలో కూడా మామిడి కాయలు చెట్లు నుంచి రాలిపోవని సుమన్ తెలిపాడు. మగ్గిన తర్వాత ఒక్కో మామిడి పండు బరువు 250-350 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొన్నాడు. మామిడి పండు లోపల టెంకలు కూడా చిన్నగా ఉంటాయని చెప్పాడు. ఆఫ్రికా నుంచి లక్ష మామిడి మొక్కలకు ఆర్డర్‌ వచ్చిందని వెల్లడించాడు సుమన్. ‘ల్యాబొరేటరీలో మట్టికి పరీక్షలు చేయించాలనుకున్నా. కానీ కుదరలేదు. అందుకే ఆర్డర్​ను రద్దు చేసుకున్నా. వేరే కాపురం అయినప్పుడు నాకు పూర్వీకుల నుంచి కొంత భూమి ఆస్తిగా వచ్చింది. ఈ భూమిలోనే మొదట 1000 మొక్కలు నాటాను. ఆ తర్వాత కొంత భూమిని కొనుగోలు చేసి మరో 1500 మొక్కలు పెంచాను. ప్రస్తుతం ఈ మొక్కలు 5ఏళ్లకే మామిడి కాయలు కాస్తున్నాయి. కొత్త తోటలోని మొక్కల నుంచి ఏటా 50- 60 కిలోల మామిడి, పాత మొక్కల నుంచి దాదాపు 150- 180 కిలోల పంట వస్తుంది. లఖేరీలో 20 వేల మొక్కలు నాటేందుకు ఇటీవల ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా. ఇక్కడ పూర్తిగా సేంద్రియ వ్యవసాయం ద్వారా మొక్కలను పెంచుతాం. ఇక్కడి చెట్లను, మామిడి పండ్లను విదేశాలకు సరఫరా చేసే ఆలోచనలో ఉన్నాం.’ అని సుమన్ తెలిపాడు.

చదువు మధ్యలోనే ఆపేసి
కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం చదువును(బీఎస్సీ) మధ్యలోనే ఆపేశాడు సుమన్. చదువు మానేశాక వ్యవసాయం చేశాడు. అందరికంటే పెద్ద కావడం వల్ల సుమన్​పై ఆర్థిక భారం మరింత పడేది. వారి కుటుంబం తమకున్న భూమిలో గోధుమ, వరి పండించేవారు. దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడం వల్ల వ్యవసాయంలో పెద్దగా లాభాలు వచ్చేవి కావు. కుటుంబ పోషణే కష్టమైపోయేది. ఆ తర్వాత రోజువారీ ఆదాయం కోసం కూరగాయల సాగును ప్రారంభించాడు సుమన్. ఆఖరికి మామిడి సాగును ఎంచుకుని విజయం సాధించాడు.