ప్రెస్‌మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్‌మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్‌మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
రోహిత్‌కు బ్యాటింగ్‌లో అందరికంటే కొంచెం ఎక్స్‌ట్రా టైం ఉంటుందంటారు.. అందుకే షాట్లు కచ్చితంగా ఉండి బంతి బౌండరీ దాటేస్తుంది. అలానే కెప్టెన్సీలో కూడా అతడికి కొంచెం దూరదృష్టి ఎక్కువ. అందరికీ అస్పష్టత ఉన్న అంశాల్లో కూడా అతడు కచ్చితమైన అభిప్రాయానికి రాగలడు. అందుకే కేవలం 12 నెలల్లోనే 3 ఐసీసీ ప్రపంచ ట్రోఫీల (టెస్టు, వన్డే, టీ20) ఫైనల్స్‌కు జట్టును తీసుకెళ్లగలిగాడు. ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అంచుల్లోకి వెళ్లిన భారత్‌ను తన వ్యూహ చతురతతో గెలిపించాడు. ఈ టీమ్ ఎంపిక నుంచి మైదానంలో ప్లాన్ల వరకు చాల భిన్నంగా అతడు వర్క్ చేశాడు. ఈ పొట్టి ప్రపంచకప్ సాధించడంలో అతడి ముద్ర స్పష్టంగా కనిపించింది.
జట్టు ఎంపికలో లోతైన వ్యూహం..
టీ20 ప్రపంచకప్ వెస్టిండీస్‌లో కదా.. బౌలింగ్ పిచ్‌లు ఉంటాయని చాలా మంది విశ్లేషకులు భావించారు. కానీ, రోహిత్ పట్టుబట్టి నలుగురు స్పిన్నర్లను(కుల్దీప్, చాహల్, అక్షర్, జడేజా) ఎంపిక చేశాడు. అదేంటీ అని అప్పట్లో చాలా మంది పెదవి విరిచారు. నాడు దీనిపై రోహిత్ స్పందిస్తూ మ్యాచ్‌లు మొదలయ్యాక ఇది అర్థమవుతుందని చెప్పి ఊరుకొన్నాడు. అక్షర్ పటేల్ అవసరమా అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. నాడు హిట్‌మ్యాన్ లాజిక్ చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు టోర్నీ ముగిసే సరికి ఐదు మ్యాచ్‌ల్లో కుల్దీప్ 10 వికెట్లు తీయగా అక్షర్ కూడా 8 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. సెమీస్‌లో ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సొంతం చేసుకున్నాడు. అటు బ్యాటింగ్‌లో కీలకమైన పరుగులు చేశాడు.
ఎదురు దాడికి నేతృత్వం..
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రత్యర్థి బౌలింగ్ దళంపై మొదటి నుంచి ఎదురుదాడి చేసి కకావికలం చేయడం చాలా కీలకం. ఇలాంటి వ్యూహంతో 1996లో జయసూర్యను వాడి శ్రీలంక వన్డే ప్రపంచకప్ కొట్టింది. అలానే 2003లో ఆసీస్.. గిల్‌క్రిస్ట్, రికీపాంటింగ్‌లను రంగంలోకి దింపి విశ్వవిజేత అయింది. వారందరినీ మించిన హార్డ్ హిట్టర్ రోహిత్. అతడే ఇప్పుడు నాయకత్వం వహిస్తుండటంతో ఎదురుదాడి బాధ్యతలు కూడా స్వీకరించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా 594 పరుగులు చేశాడు. టోర్నీలో రెండో అత్యధిక రన్స్ అవే. ఆ సీజన్‌లో అలా కలిసొచ్చి బాదాడు అనుకోవడానికి అవకాశం లేకుండా.. 2024 టీ20 ప్రపంచకప్‌లో 257 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్‌గా కింగ్ కోహ్లీతో కలిసి బరిలోకి దిగాడు. ఫైనల్స్ వరకు కింగ్ ఫామ్‌ను అందుకో లేకపోయినా.. ఆ ప్రభావం జట్టుపై పడకుండా ప్రత్యర్థి బౌలర్లను కకావికలం చేశాడు. సూపర్-8 దశలో హిట్‌మ్యాన్ ధాటికి ఆసీస్ బౌలర్లు బంతి వేయడానికి భయపడ్డారనడం అతిశయోక్తి కాదు. ప్రతి మ్యాచ్‌లో అతడు జట్టుకు బ్యాటింగ్ టోన్ సిద్ధం చేసి ఇచ్చాడు.
అపజయాల నుంచి నేర్చుకొని.. నవంబర్ లెక్కలు సరిచేసి..
గతంలో నవంబర్ నెలలో భారత్ ఎదుర్కొన్న రెండు భారీ పరాజయాలకు రోహిత్ ఈ సారి రివెంజ్ తీర్చుకొన్నాడు. 2022 పొట్టి ప్రపంచకప్ సెమీస్ నవంబర్ 10న జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లాండ్ 10 వికెట్ల విజయం సాధించింది. ఇదే అతడి కెప్టెన్సీలో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని సహచరుడు దినేశ్ కార్తిక్ వెల్లడించాడు. నాటి నుంచి తానే బ్యాటింగ్‌లో టాప్‌గేర్ వేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలిపాడు. ఆ నియంత్రణతో కూడిన దూకుడును ఇప్పటికీ కొనసాగించాడు. ఫలితంగా సెమీస్‌లో ఇంగ్లిష్ బౌలర్లను చితక్కొట్టాడు. ఆ మ్యాచ్ అనంతరం అతడు భావోద్వేగానికి గురికావడానికి అదే కారణం కావొచ్చు.
2023 నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై ఆసీస్ విజయం సాధించింది. దీనికి తోడు ఈ పొట్టికప్ సూపర్-8 కీలక మ్యాచ్‌కు ముందు ఆ జట్టు సారథి మిచెల్ మార్ష్ మాట్లాడుతూ ‘ఓడించడానికి భారత్‌కు మించిన జట్టు లేదు’ అని మానసిక యుద్ధానికి తెరతీశాడు. దీనిని హిట్‌మ్యాన్ వ్యక్తిగతంగా తీసుకొన్నట్లున్నాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌కు ప్రతీకారం తీర్చుకొన్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ‘ఇక టోర్నీ నుంచి ఆసీస్ బయటకెళ్లిపోయింది’ అని వ్యాఖ్యానించి కంగారూలకు చురకలేశాడు. టీమ్‌ఇండియాపై ప్రత్యర్థి జట్లకు మానసిక ఆధిపత్యం రానీయకుండా చూడటం.. ఉన్నదానిని పటాపంచలు చేయడం అతడి శైలిలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఆటగాళ్లను వెనుకేసుకొచ్చి..
ఆటలో క్లాస్ శాశ్వతం.. ఫామ్ తాత్కాలికమని రోహిత్ నమ్మాడు. అందుకే జట్టులో ప్రతిభావంతులు ఇబ్బంది పడుతున్న సమయంలో, వారిపై వచ్చే విమర్శలకు తాను అడ్డం పడుతుంటాడు. కోహ్లీ, దూబే, జడేజా విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో కూడా రాహుల్, శ్రేయస్‌ను ఇలానే కాపాడుకొచ్చాడు. పొట్టికప్ ఫైనల్స్ కోసమే కోహ్లీ ‘ది బెస్ట్’ను దాచి పెట్టాడని వాఖ్యానించి తన సహచరుడిలో ఆత్మవిశ్వాసం నింపాడు. కింగ్ కూడా దానిని నిలబెట్టుకొని 76 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ను దక్కించుకొన్నాడు. దూబే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఓ పక్క 2024 పొట్టి ప్రపంచకప్ కీలక దశలో అర్ష్‌దీప్ చెలరేగిపోయి వికెట్లు తీస్తున్న వేళ పాక్ మాజీ ఇంజిమామ్ అతడిపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాడు. కుర్రాడైన అర్ష్‌దీప్ మానసిక స్థైర్యాన్ని ఇవి దెబ్బతీస్తాయని గ్రహించాడు. తానే మీడియా ముందుకొచ్చి ఇంజిమామ్‌కు ‘బుర్ర ఉపయోగించి ఆలోచించు’ అని ఘాటుగా చెప్పాడు. తర్వాత మ్యాచ్‌ల్లో అర్ష్‌దీప్‌ను కొనసాగించాడు. ఫైనల్స్‌లో ఆదిలో వికెట్ సాధించినా.. కీలకమైన 19వ ఓవర్‌లో జట్లు ఆశలను నిలబెట్టాడు.
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాను అతడు తన డిప్యూటీగా తుది జట్టులోకి తీసుకొన్నాడు. మొదటి మ్యాచ్ నుంచి అవకాశాలు ఇచ్చాడు. పాండ్యా కూడా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐర్లాండ్, పాక్, అమెరికా, అఫ్గానిస్థాన్, ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌ల్లో తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికాపై తుదిపోరులో చెలరేగిపోయి.. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. ఓ రకంగా చెప్పాలంటే ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను బయటకు లాక్కొచ్చాడు. అంతేడుకాదు.. ఫైనల్ ఓవర్ బాధ్యతలు తీసుకొని విజయతీరాలాలకు చేర్చాడు.
బౌలర్ల వినియోగం..
పిచ్, మైదానం కండీషన్లను అర్థం చేసుకొని బౌలింగ్ దళాన్ని మోహరించడంలో రోహిత్‌ది ప్రత్యేకమైన శైలి. అమెరికాలో అస్థిరమైన పిచ్‌లపై ఆడే సమయంలో సిరాజ్‌కు కూడా అవకాశం కల్పించాడు. దానికి తగిన ఫలితం లభించింది. ఎప్పుడైతే టోర్నీ వెస్టిండీస్‌కు చేరిందో.. రాణిస్తున్న అర్ష్‌దీప్‌ను జట్టులో కొనసాగించి ధారాళంగా పరుగులిచ్చే సిరాజ్‌ను పక్కనపెట్టాడు. ఆ స్థానంలో కుల్‌దీప్‌కు అవకాశం కల్పించాడు. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లయ్యారు. ఈ నిర్ణయం ఫలితం చూపింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో పవర్ ప్లేలోనే అక్షర్ చేతికి బంతి అందించి ఫలితం సాధించాడు. అంతకు ముందు ఆసీస్ మ్యాచ్‌లో కూడా కుల్‌దీప్‌ను వాడి మిచెల్ మార్ష్, మ్యాక్స్‌వెల్‌ను నిలదొక్కుకోనీయలేదు. ఇక తురుపు ముక్క అయిన బుమ్రాను కూడా అవసరమైన చోట రంగంలోకి దింపుతున్నాడు. ఫైనల్స్లో ఇది స్పష్టంగా కనిపించింది.
గంటల కొద్దీ డేటాతో కుస్తీ..
డేటాను పూర్తి స్థాయిలో కెప్టెన్‌గా రోహిత్ నమ్ముతాడు. అతడు గంటల కొద్దీ వీడియోక్లిప్‌లు, విశ్లేషణలను పరిశీలిస్తాడు. ఈ మొత్తం ఆటగాళ్ల మెదళ్లలో నింపేయడు. తన వద్దే ఉంచుకొని అవసరమైన ఆటగాడికి చెప్పాల్సినంతే చెబుతాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ‘‘నేను డేటా అనాలసిస్‌ను నమ్ముతాను. కొత్త ట్రెండ్‌లను అర్థం చేసుకుంటాను. మ్యాచ్‌ల్లో ఎదురయ్యే వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీటింగ్ రూమ్‌ల్లో గంటల తరబడి గడుపుతాను’’ అని వెల్లడించాడు. అందుకే అతడు మైదానంలో కూల్‌గా ఉండగలుగుతున్నాడు. దీనికి తోడు మ్యాచ్‌పై స్పష్టమైన అవగాహన ముందే ఉండటంతో తన వ్యక్తిగత బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ఒత్తిడి కనిపించడం లేదు.