ఢిల్లీలో పవన్ “మెగా” స్కెచ్ – జనసేన అరుదైన ఫీట్

www.mannamweb.com


డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో పవన్ సమావేశమయ్యారు. బీజేపీ నేతలతోనూ సమావేశాలు నిర్వహించారు.

ఇదే సమయంలో ఏపీ రాజకీయాల పైన చర్చలు జరిగాయి. ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల పైన చర్చకు వచ్చింది. కూటమి పార్టీల సర్దుబాటులో భాగంగా నాగబాబు కు సీటు కష్టంగా మారుతున్న వేళ పవన్ నేరుగా ఢిల్లీ నేతలతో చర్చించారు. దీంతో, పెద్దల సభ లోనూ జనసేన ఎంట్రీ దాదాపు ఖాయమైంది.

పవన్ మంత్రాంగం

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన వ్యూహాత్మకంగా సాగింది. ఢిల్లీ పర్యటనలో ప్రధానితో పవన్ సమావేశం అయ్యారు. కీలక అంశాల పై చర్చించారు. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. ఏపీ లో పాలనా పరమైన విషయాలతో పాటుగా రాజకీయ అంశాల పైన చర్చించారు. బీజేపీ అగ్ర నేతలు బీఎల్ సంతోష్ తోనూ సమావేశమయ్యారు. సనాతన ధర్మం డిక్లరేషన్ అందించారు. దీని ద్వారా బీజేపీకి మరింత దగ్గరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పైన ఆయనతో చర్చించారు. ఇదే సమయంలో ఏపీలో రాజ్యసభ స్థానాల పైన పవన్ బీజేపీ ముఖ్యులతో ప్రస్తావన చేసారు.

రాజ్యసభలో జనసేన

ఏపీలో మూడు స్థానాలు ఖాళీల భర్తీకి షెడ్యూల్ జారీ అయింది. కూటమిలోని మూడు పార్టీల్లో రెండు టీడీపీ..ఒకటి బీజేపీకి దక్కేలా తాజాగా ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన బీదా మస్తాన రావుకు తిరిగి సీటు ఖాయం చేసారు. దీంతో..మిగిలిన రెండు సీట్లలో ఒకటి టీడీపీ, మరొకటి బీజేపీకి వెళ్లేలా చర్చలు జరిగాయి. దీంతో, ఢిల్లీలో పవన్ ఇదే అంశాన్ని బీజేపీ ముఖ్యుల వద్ద ప్రస్తావించారు. తాజా ఎన్నికల్లో బీజేపీ కోసం నాగబాబు అనకాపల్లి సీటు వదులుకున్న విషయాన్ని పవన్ వివరించారు.

అన్ని సభల్లోనూ ప్రాతినిధ్యం

ఈ ఎన్నికల్లో టీడీపీకి రెండు సీట్ల పైన హామీ ఉండటంతో..మూడో సీటు జనసేనకు ఇవ్వాలని ప్రతిపాదించారు. పవన్ ప్రతిపాదనకు బీజేపీ నేతలు అంగీకరించారు. దీంతో.. నాగబాబు రాజ్య సభకు ఎంపిక అవ్వటం ఖాయమైంది. టీడీపీ నుంచి బీదా మస్తాన రావుతో పాటుగా గల్లా జయదేవ్ లేదా కంభంపాటి రామ్మోహన్ రావు, సానా సతీశ్ ల్లో ఇద్దరు ఎంపికయ్యే అవకాశం ఉంది. వర్ల రామయ్య పేరు రేసులోకి వచ్చింది. నాగబాబు రాజ్యసభకు ఎంట్రీ వేళ జనసేన మరో అరుదైన ఫీట్ సాధిస్తోంది. 2019లో తొలి సారిగా అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కింది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని అసెంబ్లీ.. లోక్ సభ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పాటుగా శాసన మండలిలో అడుగు పెట్టింది. ఇప్పుడు రాజ్యసభలోనూ నాగబాబు ఎంట్రీతో ఒకే విడతలో అన్ని చట్ట సభల్లో జనసేన ప్రాతినిధ్యం దక్కించుకోవటం రికార్డుగా నిలవనుంది.