ఇరకం దీవి,ఆంధ్రా తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది ఈ చిన్న దీవి. ఇక్కడ నివసించే వారంతా మత్స్యకార కుటుంబాల వారే. చేపల వేటే వీరి ప్రధాన జీవనాధారం.ఈ దీవికి చేరుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం నీటి మీద ప్రయాణమే. అటు ఇటు వెళ్ళాలన్న ఇటు నుంచి అటు వెళ్లాలన్న నీటి మీద ప్రయాణం చెయ్యాల్సిందే .ఈ దీవి చుట్టూ పులికాట్ సరస్సు విస్తరించి ఉంటుంది. మరో వైపు బంగాళాఖాతం బ్యాక్ వాటర్ ఉంటుంది అతి చిన్న ఈ దీవి విస్తీర్ణం 1600 ఎకరాలు .ఇరకం దీవికి బ్రిడ్జి నిర్మించాలన్న స్థానికుల డిమాండ్ నేటికీ నెరవేరలేదు.
ఇక్కడి జనాభా 2000 లోపే ,నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి గ ఉన్న సమయంలో దీవి వాసులు ఆయనను కలిసి బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు ,అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన అలాగే ఉండి పోయింది ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్రిడ్జి నిర్మించేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు .వేనాడు దగ్గర నుంచి ఒక 300 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మిస్తే తమ కష్టాలు తీరుతాయంటున్నారు గ్రామస్తులు.
స్థానిక ఎమ్యెల్యేలు ఎవరూ పెద్దగా శ్రద్ధ తీసుకోకపోవడమే బ్రిడ్జి నిర్మాణం ఆలశ్యం అవడానికి ఒక కారణమని అన్నారు ఇరకం దీవి మాజీ సర్పంచ్ శేఖర్.తమ పిల్లలు చదువుకోవడానికి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా గంట సేపు పడవ పై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సివస్తుందన్నారు.పిల్లలు తిరిగి ఇంటికి వచ్చే వరకు తమకు ఎదురుచూపులే అన్నారు .ఈ దీవిని టూరిజం స్పాట్‌గా డెవెలప్ చేస్తే ఇక్కడ భూమికి మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది కోటీశ్వరులు ఇక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు
ఇక ఉద్యోగాల నిమిత్తం చాలా మంది యువకులు దీవిని విడిచి వెళ్లిపోయారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు కనీసం సెలవు రోజుల్లో కూడా సొంత ఊరికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. రాను పోను రెండు గంటల పాటు పడవ ప్రయాణం చేయాల్సి రావడంతో ఊరు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు.మరో విషయం ఏంటంటే ఈ దీవిలో చాలా మంది అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు, ఎందుకో తెలుసా?ఇక్కడ అమ్మాయిని ఇస్తే వాళ్లు గర్భం దాల్చిన సమయంలో హాస్పిటల్‌కి వెళ్లాలన్నా కూడా పడవ ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటోంది.అనేక సార్లు నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు హాస్పిటల్‌కు వెళ్తూ పడవ లోనే ప్రసవించారు.మరి కొన్ని సందర్భాల్లో చనిపోయారు కూడా.
దీంతో ఆడపిల్లను ఈ ఊరి అబ్బాయిలకు ఇవ్వాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు.పెళ్లి కావాలంటే ఊరు వదిలి వస్తేనే పిల్లను ఇస్తాం అంటూ ఆడపిల్ల తరపు వారు షరతులు పెట్టడం విశేషం.ఊరు వదిలి రావడం ఇష్టం లేని చాలా మంది అబ్బాయిలు బ్రహ్మచారులు గానే మిగిలిపోతున్నారు.ఇంకో ఐదారు సంవత్సరాల్లో ఊరిని ఖాళి చేసి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు గ్రామస్థులు. ఇప్పటికే కొన్ని కుటుంబాలు వెళ్లిపోయాయని మిగిలిన వారు కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు ఓ మాజీ ఎంపీటీసీ .ప్రకృతి నిలయం గా ఉన్న ఇరకం దీవిలో ప్రజలు పడుతున్న కష్టాలు ,వీరి ఆవేదనను ప్రభుత్వాలు అర్ధం చేసుకొని బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు వేస్తాయేమో చూద్దాం