Mishri: వేసవిలో పటిక బెల్లం వాడితే శరీరానికి ఎంత చలవో తెలుసా?

పటిక బెల్లాన్ని మిశ్రి లేదా ఇండియన్ రాక్ షుగర్ అని పిలుస్తారు. మన తెలుగిళ్లలో ఇది ఉండే అవకాశం ఎక్కువే. ఎందుకంటే దేవునికి ప్రసాదంగా ఎక్కువమంది దీన్నే నివేదిస్తూ ఉంటారు.
పటిక బెల్లం అంటే మరేదో కాదు శుద్ధి చేయని చక్కెర. చెరుకు సిరప్తో తయారు చేసే పదార్థమే ఇది కూడా. అయితే చక్కెర, చెరుకు రసంతో పోలిస్తే పటిక బెల్లంలోనే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ.


సాధారణ చక్కెరకు బదులు పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల జీవక్రియకు మేలు కలుగుతుంది. వీటిలో ఇన్ఫ్లమేషన్తో పోరాడే ఖనిజాలు, సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఆరు రుచులతో కూడిన భోజనమే ఆరోగ్యకరమైనది. ఇందులో తీపి కూడా ఒక రుచి. ఆ తీపి రుచి కోసం చాలామంది రకరకాల స్వీట్లు తింటూ ఉంటారు. వాటికి బదులు చిన్న ముక్క పటికబెల్లం తినడం మంచిది. ఇది శరీరంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపిస్తుంది. శరీరం నుంచి వాత, పిత్త, కఫ అనే మూడు దోషాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది.
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నప్పుడు ఈ పటిక బెల్లంతో రీఫ్రెష్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. పంచదారకు బదులు పటికి బెల్లాన్ని వేస్తే చాలు, ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి ఎలక్ట్రోలైట్స్ను అందించి సమతుల్యం చేస్తుంది. మనసును రిలాక్స్గా ఉంచుతుంది.

జీర్ణ క్రియ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా పటిక బెల్లం ఎంతో సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆహారాన్ని త్వరగా విచ్ఛిన్నం అయ్యేలా చేసి జీర్ణం సక్రమంగా అయ్యేలా చేస్తుంది.

ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు అవసరం. ఇవన్నీ కూడా పటిక బెల్లంలో ఉంటాయి.
దగ్గు, జలుబు వంటివి వేధిస్తున్నప్పుడు ఆయుర్వేదంలో పటికబెల్లం ఉపయోగించే ఔషధాలను తయారు చేస్తారు. ఎండుమిర్చి, నెయ్యి, పటిక బెల్లం పొడి కలిపి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించే శక్తి దీనికి ఉంది. పటిక బెల్లంలో గ్లైసిరైసిన్ అనే సమ్మేళనం ఉంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.

పటిక బెల్లం నాడీ వ్యవస్థపై, నరాలపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజుకో చిన్న ముక్క పటిక బెల్లం తింటే అన్ని విధాలా మంచిది.