తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిషన్ అహం బ్రహ్మాస్మి సంస్థల్లో చీకటి బాగోతం బయటపడింది. అమాయక కుటుంబాలకు ఆధ్యాత్మిక వల వేసి..
ఆస్తులు గుల్ల చేస్తున్నారు. బాధిత కుటుంబాల వరుస ఫిర్యాదులతో సంస్థ నిర్వాకం బట్టబయలైంది.
మిషన్ అహం బ్రహ్మాస్మి సంస్థ పేరుతో తమ కుటుంబ సభ్యులను లొంగదీసుకుని దూరం చేస్తున్నారని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. తన భార్య, పెళ్లైన కూతురు, కొడుకు తనను వదలిపెట్టి సంస్థ అధినేత సహస్త్ర అధినేత ట్రాప్ లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితుడు.
2016లో అహం బ్రహ్మాస్మి సంస్థను ప్రారంభించారు తారా విశాల్ దంపతులు. విశాఖలో ఆధ్యాత్మిక స్పీచులతో ప్రజలను ఆకట్టుకుని చాలా కుటుంబాలకు వల వేశారని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. అలానే చిక్కుకుంది సత్యనారాయణ అతని కుటుంబం. అయితే కొంత కాలం తర్వాత తమ ఇళ్లు రాసివ్వాలని సంస్థ ఒత్తిడి తేవడంతో.. అనుమానం వచ్చి ఆశ్రమం నుంచి బయటకు వచ్చానని వాపోతున్నాడు సత్యనారాయణ. కానీ భార్య పిల్లలు అక్కడే ఉండిపోయారని.. ఇందులో పెళ్లై స్విడన్ కు వెళ్లిన కూతురు కూడా తిరిగొచ్చి ఆశ్రమంలో చేరిందని.. ఆ తర్వాత పెళ్లైన కొడుకు కూడా భార్యను వదిలేసి ఆశ్రమంలోనే ఉండిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఒకటి, రెండు కుటుంబాలు కాదు.. పదుల సంఖ్యలో కుటుంబాలు.. వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. తాము కూడా ఇలాగే చిక్కుకున్నామని వాపోతున్నాడు గోపిశెట్టి ప్రవీణ్. కుటుంబ పరిస్థితుల కారణంగా 2014లో మిషన్ ఆహం బ్రహ్మాస్మీ విషపు కోరల్లో చిక్కుకుపోయి జీవితాన్ని నాశనం చేసుకున్నానని కన్నీరు పెడుతున్నాడు. సంస్థ ఆదేశాల మేరకు చదువుకుంటున్న కొడుకు స్కూల్ మాన్పించి మరి ఆశ్రమంలో చేర్పించానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత సంస్థ ఫౌండర్ తారా విశాల్ ట్రాప్ లో పడి.. ఇంటిని అమ్మి సంస్థకు విరాళంగా ఇచ్చానని.. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న భార్యను సైతం గెంటేశానని చెబుతున్నాడు ప్రవీణ్.. ఆస్తులు గుల్ల చేసుకుని ఆశ్రమానికి విరాళం ఇస్తే.. కొంతకాలానికి ఆశ్రమం నుంచి వెళ్లిపోమన్నారని ఆరోపిస్తున్నారు.
ఇలా అనేక మంది బాధిత కుటుంబాలు ఒకేసారి మిషన్ అహం బ్రహ్మాస్మి సంస్థ, దాని యజమాని సహస్త్రపై ఫిర్యాదు చేశారు. దీంతో పీఎం పాలెం పోలీస్ట్ స్టేషన్ కు వచ్చారు సహస్త్ర, ఆమె ఆధీనంలో ఉన్న ఇతర వ్యక్తుల కుటుంబసభ్యులు. తమ కుటుంబసభ్యులను తమకు అప్పగించి.. సహస్త్రపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధిత కుటుంబాలు.