తిరువూరు: బాధితులకు సత్వర న్యాయం పేరుతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. కంభంపాడులో వైకాపా నేత కాలసాని చెన్నారావు చేపట్టిన అక్రమ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే దగ్గరుండి కొంత మేర కూల్చివేయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనపుడు తన లాంటి వారు రాజకీయాల్లో కూడా అవసరం లేదన్నారు.
‘‘కంభంపాడులో చెన్నారావు అరాచకాలతో ఎంతో మంది గ్రామం విడిచి వెళ్లిపోయారు. చంద్రబాబు, కేశినేని చిన్ని కాన్వాయ్‌ల మీద రాళ్ల దాడి చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పటి మంత్రి దేవినేని ఉమా.. చెన్నారావుకు భయపడి ఆ గ్రామంలో పర్యటన రద్దు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా కడితే ఐదు నిమిషాల్లో కాళ్లు, చేతులు విరగ్గొడతారు. గ్రామంలో ప్రజలు ఓటేసేందుకు వెళ్లకుండా రోడ్డుపై ముళ్ల కంప వేస్తారు. దుకాణాల్లో సరకులు తీసుకుంటారు.. డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లలోకి చొరబడి మహిళలను వేధిస్తారు. దారినపోయేవారిని ఆపి బైక్‌లు లాక్కుంటారు. భయపెట్టి, దాడులు చేసి భూములు రాయించుకుంటారు. కోడిపందేలు, పేకాట, మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం.. ఇలా చిన్న గ్రామంలో రోజుకి రూ.లక్ష అక్రమ సంపాదన. చెన్నారావు అరాచకాల వల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైకాపా నేత ఇతనిపై రౌడీషీట్ పెట్టించారు. వైకాపా ఎమ్మెల్యేగా పనిచేసిన రక్షణ నిధి.. నిబంధనలకు విరుద్ధంగా రౌడీషీట్ రద్దు చేయించారు. అధికారులందరూ అతనికి దాసోహం. గత ఐదేళ్ల వైకాపా పాలనలో రూ.50 కోట్ల అక్రమ సంపాదన.
ఇవన్నీ విన్న తర్వాత కూడా ఆ గ్రామంలో ప్రచారానికి వెళ్లా.. తెదేపా జెండా ఎగరేశా. ప్రజలు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసే ధైర్యం కల్పించా. ఆ గ్రామంలో నాకు భారీ మెజార్టీ వచ్చింది. నాకు భయపడి.. ఇసుక, మట్టి దందాలు ఆపేశారు. కేశినేని చిన్నిపై రాళ్ల దాడి చేసిన చెన్నారావుపై కేసు పెడితే పోలీసులు వారం రోజులు పట్టించుకోలేదు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఈరోజు అరెస్టు చూపిస్తున్నారు. నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కుని, పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. అక్రమ నిర్మాణం ఆపాలని రెవెన్యూ అధికారులకు చెబితే.. అతన్ని కాపాడేందుకు వంద కథలు చెప్పారు. ఘటనకు 240 గంటల ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా అధికారులు స్పందించలేదు. చివరికి నేను స్వయంగా రంగంలోకి దిగి, గత్యంతరం లేక వేలాది మంది బాధితులతో నిరసన చేపడితే .. చివరికి నోటీసులిచ్చి నిర్మాణం ఆపారు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవి శాశ్వతం కాదు. నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు’’ అని ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఎమ్మెల్యే కొలికపూడి వివరణ కోరిన సీఎం చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం కంభంపాడులో మంగళవారం జరిగి ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి వివరణ కోరారు. కొందరు అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తాను కోరినా వారి నుంచి స్పందన లేనందుకే వెళ్లాల్సి వచ్చిందని కొలికపూడి వివరించారు. 2013లో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడి, ఇటీవల ఎన్నికల సందర్భంగా కేశినేని చిన్నిపై రాళ్ల దాడి ఘటనను వివరించారు. చట్ట పరిధిలో దోషుల్ని శిక్షిద్దాం.. క్షేత్ర స్థాయికి వ్యక్తిగతంగా వెళ్లొద్దని చంద్రబాబు కొలికపూడికి సూచించినట్టు సమాచారం.