భర్త చనిపోయిన తరువాత కూలి పనులు చేస్తూ నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులను చేసిన తల్లి

నలుగురు కూతుళ్లతో తల్లి గౌరమ్మ”పెళ్లి చేసెయ్యి. ఇంతమందిని ఇంట్లో పెట్టుకుంటే ఎలా అని చాలా మంది అన్నారు. ఈ రోజు మా పిల్లలు నలుగురికీ ప్రభుత్వ ఉద్యోగం ఉంది.


మాకిప్పుడు ఎలాంటి లోటూ లేదు”..

భర్త మరణించినా, కూలీ పనులకు వెళ్లి కష్టపడి నలుగురు కూతుళ్లనూ చదివించి.. ప్రభుత్వ ఉద్యోగులను చేసిన తల్లి గౌరమ్మ గర్వంగా చెప్పిన మాటలివి.

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని వేపమాకులపల్లెకు చెందిన గౌరమ్మ, మునివెంకటప్ప దంపతులకు నలుగురు కుమార్తెలు.. వీణాకుమారి, వాణి, వనజాక్షి, శిరీష.

తండ్రి చిన్నప్పుడే చనిపోయినా, తల్లి కష్టం వృథా కాకుండా పోటీపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు నలుగురూ.

వీరిలో పెద్ద కూతురు వీణా కుమారి, మూడో కూతురు వనజాక్షి పోలీస్ కానిస్టేబుళ్లు కాగా, రెండో కూతురు వాణి, చివరి అమ్మాయి శిరీష టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలు సంపాదించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ నలుగురు అక్కాచెల్లెళ్ల స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తెలుసుకోడానికి ‘బీబీసీ’ గౌరమ్మ ఇంటికి వెళ్లింది.

గ్రామం ఎలా ఉందంటే..

వేపమాకులపల్లె గ్రామం పుంగనూరుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలో సుమారు 30 ఇళ్ల వరకూ ఉన్నాయి. వాటిలో, మధ్యలో ఉంది గౌరమ్మ ఇల్లు.

పాతకాలంనాటి బండ్లమిద్దె, ముందు వైపు రేకులు వేసిన పంచ ఉంది.

ఇంటిపైకి వెళ్లడానికి మెట్లు కూడా లేవు. ఆ ఇంట్లో నలుగురు కూతుళ్లను పెంచి, పెద్దచేసింది. ఉద్యోగాలు సాధించిన తర్వాత ఇద్దరికి పెళ్లిళ్లు చేసింది.

ఆమెకు కొంత వ్యవసాయ భూమి కూడా ఉంది. అయితే, ఆమె కూలి పనులకు కూడా వెళ్లేవారని చెప్పారు.

తన కూతుళ్లు కూడా ఉపాధి హామీ పనులకు వెళ్లారని గౌరమ్మ బీబీసీతో చెప్పారు.

భర్త మరణం తరువాత

2007లో గౌరమ్మ భర్త మునివెంకటప్ప అనారోగ్యంతో మరణించినప్పుడు, నలుగురు ఆడపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

”మా ఆయన చాలా బాగా చూసుకునేవారు. నా పిల్లలకి ఏం తక్కువ. మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్లే నాకు అని చెప్పేవారు. ఆయనకి 2007లో పచ్చకామెర్లు, పక్షవాతం వచ్చి చనిపోయారు. అప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. మా అన్న నేనున్నాను చదివిద్దాం అన్నాడు” అని గౌరమ్మ గుర్తు చేసుకున్నారు.

కూలి పనులకు వెళ్తూనే పిల్లలను చదివించానని చెప్పిన ఆమె.. నలుగురు ఆడపిల్లల్లో పెద్దదైన వీణా కుమారి తనకు అండగా నిలిచిందని, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిందని చెప్పారు.

“నా బాధ ఎంతైనా కానీ పిల్లల్ని మాత్రం బాగా చదివించాలని చెప్పి చదివించాను. నన్ను అర్థం చేసుకున్నారు మా పిల్లలు కూడా. పెద్ద పాప వీణా కుమారి బాగా చదువుతుంది. బయట స్కూల్‌కి వెళ్లమ్మా అంటే ఒప్పుకునేది కాదు. మన పరిస్థితి బాలేదు చెల్లి వాళ్లు చదువుకోనీ అనేది. చెరువు పనిచేసి తర్వాత కాలేజీకి పోయేది. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. మేమంతా భయపడ్డాం. వద్దు.. పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు అని. చేసుకోవడానికి ఎవరూ రాకపోయినా ఫర్వాలేదు, ఇట్లానే ఉంటానంది” అన్నారు గౌరమ్మ.

కష్టాలే పట్టుదలను పెంచాయి..

తమ చిన్నతనం నుంచి ఎదురైన కష్టాలే తమలో బాగా చదువుకోవాలనే పట్టుదలను పెంచాయని పెద్దమ్మాయి, మదనపల్లెలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వీణా కుమారి చెప్పారు.

“మా నాన్న చనిపోయినప్పుడు మేం చిన్న పిల్లలం. మా మేనమామ శ్రీరాములు మాత్రం మాకు మంచిగా సపోర్ట్ ఉండి ఆడపిల్లలైనా, మగపిల్లలైనా మీరే అన్నారు. మా మామగారు, మా అమ్మ మాకు అండగా నిలిచారు” అన్నారామె.

ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే చదువుకున్నామని వీణా చెప్పారు. తల్లి ఒక స్నేహితురాలిలా తమను ఎంకరేజ్ చేసిందన్నారు.

”మేమందరం గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీల్లోనే చదువుకున్నాం. మా అమ్మ కూలి పనులు, వ్యవసాయం గానీ చేసేవారు. ఒక ఫ్రెండ్‌లా మాతో చాలా కలుపుగోలుగా ఉండేవారు. మేం కూడా ప్రతి విషయాన్ని మా అమ్మతో షేర్ చేసుకునేవాళ్లం.”

తనకు పెళ్లైన తర్వాత, భర్త కూడా తమ కుటుంబానికి అండగా నిలిచారని, తన ముగ్గురు చెల్లెళ్లు కూడా బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించడంలో తోడుగా నిలిచారని వీణా కుమారి తెలిపారు.

”నాకు 2015లో పెళ్లయింది. మా ఆయన ప్రోత్సహం అందించారు. అలా 2016లో మా రెండో చెల్లెలు వాణికి టీచర్ జాబ్ వచ్చింది. తర్వాత 2018లో వాణికి పెళ్లి చేశాం” అని చెప్పారు వీణాకుమారి.

‘పెళ్లి చేసి పంపించేయమని అమ్మతో చెప్పేవారు’

పెద్దమ్మాయి వీణాకుమారికి 2014లో మహిళా కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, రెండో అమ్మాయి వాణి 2016లో టీచర్ అయ్యారు.

ఆడపిల్లలున్న కుటుంబం అని సమాజం, బంధువులు తమను చిన్నచూపు చూశారని.. కొందరి మాటలు తమపై తీవ్రంగా ప్రభావం చూపాయని కూడా ఈ అక్కాచెల్లెళ్లు చెబుతున్నారు.

పెళ్లి చేసి పంపిస్తే అమ్మాయిలు బాగుపడతారని చాలామంది మా అమ్మతో అనేవారని గౌరమ్మ రెండో కూతురు వాణి గుర్తు చేసుకున్నారు.

”మొదట్లో ఆడపిల్లలు అని మమ్మల్ని చాలా తక్కువ అంచనా వేసేవారు. కానీ ఇప్పుడు జాబ్స్ వచ్చిన తర్వాత ఆడపిల్లలైనా సాధించారు అని పొగుడుతున్నారు. కానీ, ఆ రోజు ఎవరూ మమ్మల్ని ప్రోత్సహించలేదు. ఆడపిల్లలకు నువ్వు పెళ్లిళ్లు చేయవు, ఆ పిల్లల్ని ఏదో చేస్తావు అంటూ మా అమ్మని చాలా అవమానించే వాళ్లు. ఇప్పుడు మా చెల్లెళ్లు ఇద్దరికీ ఈ సంవత్సరం ఒకేసారి జాబ్ రావడంతో మా అమ్మ చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు” అన్నారామె.

బ్యాంక్ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన మూడో అమ్మాయి వనజాక్షి చివరకు 2025లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.

”నేను కానిస్టేబుల్‌గా 2025లో సెలెక్ట్ అయ్యాను. మా అమ్మ మీకు జాబ్ ఉంటే సెక్యూర్‌గా ఉంటుంది అని చాలా మోటివేషన్ చేశారు. అమ్మ తర్వాత అక్కలు ఇద్దరూ నాకు సపోర్ట్ చేసేవారు. వాళ్లకి మ్యారేజ్ అయిన తర్వాత బావలు సుబ్రహ్మణ్యం, అనిల్ కుమార్ కూడా మాకు మరింత సపోర్ట్ ఇచ్చారు” అన్నారు.

ఊహ తెలియకముందే..

ఇక అందరి కంటే చిన్నమ్మాయి శిరీష కూడా ఈ ఏడాది(2025) టీచర్(ఎస్జీటీ) ఉద్యోగం సాధించారు.

తనకు ఊహ తెలియకముందే తండ్రి చనిపోవడంతో అమ్మ, అక్కలే అన్నీ చూసుకున్నారని, తనను పెంచారని చెప్పారు శిరీష.

”నేను థర్డ్ క్లాస్‌లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పుడు అసలు నాకు ఊహ కూడా తెలీదు. మా అమ్మకి ఎన్ని కష్టాలొచ్చినా చదివించింది.”

“ఇలాంటి ఇంట్లో పుట్టడం నా లక్. మళ్లీ జన్మంటూ ఉంటే ఇదే అమ్మ కడుపున పుట్టాలనుకుంటున్నా” అన్నారు శిరీష.

అల్లుళ్ల సహకారం

నలుగురు అక్కాచెల్లెళ్లలో వీణా కుమారి, వాణిలకు వివాహమైంది. భర్తల ప్రోత్సాహం మిగతా ఇద్దరు చెల్లెళ్లను బాగా చదివించడానికి తోడ్పడిందని వారిద్దరూ చెప్తున్నారు.

తనకు వచ్చిన అల్లుళ్లు కొడుకుల్లా తన ఇంటి బాగోగులు చూసుకున్నారని, మిగతా ఇద్దరు కూతుళ్లు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకునేలా ప్రోత్సహించారని గౌరమ్మ చెప్పారు.

”మా పెద్ద అల్లుడు కూడా పోలిసే. తను కూడా మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. రెండో పాపకి కూడా పెళ్లి చేశాం. ఇద్దరు అల్లుళ్లు కూడా అన్నదమ్ముల్లా ఉంటూ మాకు కొడుకు లేని లోటు తీర్చారు. మా పిల్లలకు అన్న లేని లోటు, నాన్న లేని లోటు తీర్చారు” అన్నారు గౌరమ్మ.

అత్తయ్య కష్టానికి ఫలితం దక్కాలనే మిగిలిన కూతుళ్లను కూడా బాగా చదివించాలని అనుకున్నామని రెండో అల్లుడు అనిల్ కుమార్ చెప్పారు. ఈయన కూడా టీచర్‌.

”వాళ్లకు అవసరమైన సహకారం అందిస్తూ మా వంతు సాయం చేశాం. మా అత్తగారు కూడా ఎన్ని కష్టాలున్నా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పిల్లలను చదివించి ఈ స్థాయికి తీసుకురావడం గర్వకారణం” అన్నారాయన.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.