ఉదయం లేచిందంటే చాలు, అమ్మవాళ్లు ఈ రోజు ఏ టిఫిన్ చేయాలా? ఫ్యామిలీకి ఎలాంటి కొత్త రకం వంటను పరిచయం చేయాలని తెగ ఆలోచిస్తుంటారు. అలాంటి వారికే కాకినాడ రుచిని పరిచయం చేద్దాం.
ఇప్పుడు మనం నోరూరించే కాకినాడ టేస్టీ టేస్టీ పెసరట్టు ఎలా తయారు చేయాలంటే?
కాకినాడ స్పెషల్ పెసరట్ల కోసం కావాల్సిన పదార్థాలు ఇవే : పొట్టుతో ఉన్న పెసరపప్పు కప్పు, బియ్యం ఒకటిన్నర టేబుల్ స్పూన్, మినపప్పు టేబుల్ స్పూన్, రుచికి సరిపడా ఉఫ్పు, సన్నటి ఉల్లిపాయ ముక్కలు.
తయారీ విధానం : పెసరట్టు తయారు చేయడానికి ఒక రోజు ముందు రాత్రి బౌల్‌లో కప్పు పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటికి సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మరో బౌల్ తీసుకొని అందులో పైన చెప్పిన ప్రకారం, మినపప్పు, బియ్యం వేసి నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు నీళ్లను వంపేసి శుభ్రంగా కడిగేసుకొని, నాలుగు టేబుల్ స్పూన్ల పెసరపప్పు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని, అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి, రుచికి సరపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం, మినపప్పును మెత్తగా గ్రైన్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి.
దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి, దానిపై దోసె పెనం పెట్టి కాస్త వేడి చెయ్యాలి. పెనం వేడి అయ్యాక, మంటను కాస్త తగ్గించి, గరిటెడు పిండి తీసుకొని, చిన్న చిన్న పెసరట్టులు వేసుకోవాలి. ఇది కాస్త మందంగానే ఉంటుంది. దీని తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న పెసరపప్పు, టీస్పూన్ ధనియాల కారం వేసి గరిటతో స్పెడ్ చేయాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకొవాలి.అంతే సింపుల్‌గా చేసుకొనే, టేస్టీ టేస్టీ కాకినాడ స్పెషల్ పెసరట్టు రెడీ. దీనిని మీరు అల్లం చట్నీ లేదా, పల్లీ చట్నీతో తింటే ఆ రుచికి మైమరిచిపోవాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెంటనే పెసరట్టు రెడీ చేయండి.
































