నోరూరించే రాగి, పల్లీ లడ్డూ! – సూపర్ టేస్టీ, హెల్దీ ఫుడ్

ఇంట్లో చిరుతిళ్లు ఎంతో ముఖ్యం! అవును.. మనం పెద్దగా పట్టించుకోముగానీ, పిల్లలు తరచుగా దుకాణాల్లోని జంక్​ ఫుడ్​ ఎక్కువగానే ఖాళీ చేసేస్తుంటారు. దీనివల్ల పెద్దలు డబ్బు, పిల్లలు ఆరోగ్యం కోల్పోతుంటారు. అందుకే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. ఇందుకోసం పిల్లలు దుకాణం వైపు వేలు చూపించకముందే మీరు వారి చేతికి స్నాక్స్ అందివ్వాలి.


పిల్లలు ఎలాగో స్వీట్స్, చాక్లెట్స్​ ఎక్కువగా తింటారు. అలాంటి ఓ రెసిపీనే మీరు హెల్దీగా తయారు చేసి ఇస్తే సరి. ఆరోగ్యానికి ఆరోగ్యం దక్కుతుంది. మీకూ డబ్బు సేవ్ అవుతుంది. అలాంటి రెసిపీనే ఈ రాగి పిండి – పల్లీ లడ్డు. మరి, దీన్ని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు – 1 కప్పు
  • పచ్చి కొబ్బరి – రెండు చెక్కలు
  • నెయ్యి – 4 స్పూన్లు
  • రాగి పిండి – 3 కప్పులు
  • బెల్లం – కప్పు
  • ఖర్జూరాలు – అర కప్పు
  • యాలకులు – 4
  • డ్రై ఫ్రూట్స్

తయారీ విధానం :

  • ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో పల్లీలు వేసి కాసేపు ఫ్రై చేయాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి
  • ఇప్పుడు స్టౌమీద అదే పాన్ పెట్టి అందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలి
  • వేడెక్కిన తర్వాత ముందుగానే తురుముకున్న పచ్చికొబ్బరిని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చక్కగా వేగిందనుకున్న తర్వాత మొత్తం ఒక బేసిన్​ లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి
  • ఇప్పుడు మరోసారి పాన్ పెట్టుకొని అందులో స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేడెక్కిన తర్వాత 3 కప్పుల రాగి పిండి వేసుకోవాలి
  • నెయ్యి పూర్తిగా కలిసిపోయేలా పిండిని గరిటతో కలుపుతూ ఉండాలి. కాసేపు తర్వాత పిండి కాస్త రంగు మారే వరకు మిక్స్ చేసుకోవాలి
  • ఈ గ్యాప్​లో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను మిక్సీ పట్టుకోవాలి
  • మిక్సీ జార్​లో పల్లీలతోపాటు బెల్లం, ఖర్జూరాలు, యాలకులు వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి
  • గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ బాదం మిశ్రమాన్ని కొబ్బరి తురుము మిశ్రమం వేసుకున్న బేసిన్​లో వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రాగి పండిని కూడా ఇందులోనే వేసుకోవాలి
  • ఇప్పుడు మరోసారి పాన్ స్టౌ మీద పెట్టుకొని స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కరిగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్​ను వేసుకోవాలి.
  • డ్రై ఫ్రూట్స్ ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, పిస్తా, కిస్​ మిస్​ ఇలా ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలూ వేసుకోవచ్చు. వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. అయితే కిస్​ మిస్​ మాత్రం డ్రై నట్స్​ వేగిన కాసేపటి తర్వాత అందులో వేయాలి. ముందుగా వేస్తే మాడిపోయే అవకాశం ఉంటుంది.
  • చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా బేసిన్​ లో వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే చేయి పెడితే కాలుతుంది. అందుకే గరిటతో కలుపుకోవాలి.
  • ఆ తర్వాత చేత్తో పట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడే పిండిని చక్కగా మిక్స్ చేసుకొని లడ్డూలుగా తయారు చేసుకోవాలి.
  • అంతే.. ఎంతో హెల్దీగా ఉండే రాగి పిండి లడ్డూలు సిద్ధమైపోతాయి.
  • రాగుల్లో కావాల్సినంత ఐరన్ ఉంటుంది. ఇంకా బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పల్లీలు, డ్రై ఫ్రూట్స్​లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఈ లడ్డూలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతుంటారు.
  • పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దలు కూడా రోజూ ఒకలడ్డూ తింటే చాలా మంచిది. అందుకే తప్పకుండా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.