ఈ ఏడాది చివరి నాటికి AI మానవులను అధిగమిస్తుందని మస్క్ చెప్పారు

మేధాశక్తి విషయంలో ఈ ఏడాది చివరికల్లా మనుషులను కృత్రిమ మేధ (ఏఐ) అధిగమిస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అంచనా వేశారు. రానున్న ఐదేండ్లలో ఏఐ మొత్తం మానవాళిని మించిపోతుందన్నారు.

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో బ్లాక్‌ రాక్‌ సీఈవో లారీ ఫింక్‌తో ఆయన సంభాషించారు. నాగరికత, ఆర్థిక వ్యవస్థలు, నిత్య జీవితం రూపురేఖలను మార్చే విధంగా ఏఐ, రోబోటిక్స్‌, ఇతర ఫాస్ట్‌ మూవింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఏఐ సొంతంగానే ప్రపంచాన్ని మార్చుతున్నదని, రోబోటిక్స్‌తో ఏఐ సాఫ్ట్‌వేర్‌ కలవడం అసలైన గేమ్‌ఛేంజర్‌ అవుతుందని తెలిపారు. తెలివితేటలు తెరల నుంచి భౌతిక యంత్రాలకు మారినపుడు, ఆర్థిక ప్రభావం విపరీతంగా ఉంటుందని హెచ్చరించారు.


అడ్వాన్స్‌డ్‌ ఏఐతో కూడిన హ్యూమనాయిడ్‌ రోబోలు మునుపెన్నడూ లేనంత ఆర్థిక వ్యవస్థ విస్తరణ దశను తీసుకొస్తుందని, అది గతంలోని పారిశ్రామిక విప్లవాలను అధిగమించవచ్చునని వివరించారు. తన కంపెనీ టెస్లాలోని కన్జూమర్‌ మార్కెట్లోకి ఇప్పటికే హ్యూమనాయిడ్‌ రోబోలను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నామన్నారు. ఇవి అన్ని రకాల పనులను చేయగలవని, ఫ్యాక్టరీల్లో, ఇండ్లలో పని చేయగలవని చెప్పారు. ఇవి సాధారణ ప్రజానీకానికి వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రావచ్చునని తెలిపారు. ఏఐ వృద్ధికి ఇంధన సరఫరా అతి పెద్ద ఆటంకంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. మానవుల కన్నా ఎక్కువ సంఖ్యలో రోబోలు ఉండే రోజులు రాబోతున్నాయన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.