ఫుడ్‌ లవర్స్‌కి శుభవార్త.. ఇక తక్కువ ధరకే మటన్‌

www.mannamweb.com


మాంసాహారం మన జీవితంలో ఓ తప్పనిసరి భాగం అయ్యింది. ఒకప్పుడు పండగ, పబ్బానికో లేకపోతే.. ఇంటికి చుట్టం వస్తేనో మాంసం వండేవారు. అది కూడా కోడి. ఇక మటన్‌ అంటే చాలా ఖరీదైన అలవాటు. అయితే రాను రాను జనాల్లో ఈ అభిప్రాయం మారుతోంది. ఇప్పుడు చాలా మందికి ముప్పుటలా ముక్క ఉండాల్సిందే.. లేదంటే ముద్ద దిగదు. ఇక ఆదివారం వస్తే.. ఒకటికి రెండు నాన్‌వెజ్‌ వెరైటీలు ట్రై చేస్తుంటారు. ఇక శ్రావణమాసం ముందు వరకు కూడా మన దగ్గర నాన్‌వెజ్‌ ధరలు భారీగా ఉన్నాయి. చికెన్‌ కిలో 300 రూపాయలు పలకగా.. కొన్ని ప్రాంతాల్లో కేజీ మటన్‌ వెయ్యి రూపాయలు పలికింది. దాంతో చాలా మంది మటన్‌ మానేశారు. మరీ మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా.. అయితే మీకో శుభవార్త.. ఇక హైదరాబాద్‌లో తక్కువ ధరకే మటన్‌ వంటకాలు లభ్యం కానున్నాయి. ఆ వివరాలు..

హైదరాబాద్‌లోని నాన్‌వెజ్‌ ప్రియులకి ఇది పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. ఇకపై వారి కోసం తక్కువ ధరలోనే నాణ్యమైన నాన్‌వెజ్ వంటకాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం ఈ నాన్‌వెజ్ వంటకాలను భోజన ప్రియులకు అందించనుంది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలో మటన్‌ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పశు సంవర్ధకశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ వెల్లడించారు. హైదరాబాద్‌ శాంతినగర్‌లోని సమాఖ్య ఆఫీసు ఆవరణలో త్వరలోనే మొదటి మటన్‌ క్యాంటీన్‌ను ప్రారంభించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

మంగళవారం (ఆగస్టు 6) ఆయన రాష్ట్ర పశుగణాభివృద్ధి, పశువైద్యమండలి, క్వాలిటీ ల్యాబ్‌లను తనిఖీ చేశారు. ఫిష్‌ క్యాంటీన్‌ మాదిరే నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో మటన్‌ క్యాంటీన్‌ను ప్రారంభించాలన్నారు. ఈ మేరకు గొర్రెలు, మేకల పెంపకందార్ల సమాఖ్య ఎండీ సుబ్బ రాయుడుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నాణ్యతలో రాజీ లేకుండా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్నారు. అందుబాటు ధరలో మటన్ బిర్యానీ, పాయా, ఖీమా, గుర్దా ఫ్రై, పత్తర్ కా గోష్‌లతో పాటు ఇతర మాంసాహార వంటకాలను ఈ క్యాంటీన్లలో విక్రయించనున్నారు.

ఇక ఇప్పటికే శాంతినగర్‌లోఫిష్ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఫిష్ భవన్ సమీపంలో ఉన్న ఈ క్యాంటీన్‌లో.. ఫిష్ ఫ్రై, ఫిష్ బిర్యానీతో పాటు ఇతర వంటకాలను భోజన ప్రియులకు అందుబాటులో ఉంచారు. కాగా, కొత్తగా ఏర్పాటు చేసే మటన్ క్యాంటీన్లలో పైన చెప్పిన మెనూతో పాటు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఇతర వంటకాలను కూడా చేర్చనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మటన్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కేజీ మటన్ రూ.800- రూ.1000 మధ్య పలుకుతోంది. హోటళ్లలో మటన్‌ బిర్యానీ ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో తక్కువ ధరకు నాన్ వెజ్ వంటకాలు అందించేందుకు సిద్ధమవుతుండటంతో.. ఫుడ్‌ లవర్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు.