Nara Lokesh: విద్యా వ్యవస్థలో మార్క్ చూపిస్తున్న నారా లోకేష్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకారం చుట్టారు. గత ఐదేళ్లు విద్యా వ్యవస్థను వైసీపీ భ్రష్టు పట్టించిందన్న ఆరోపణలు చాలానే ఉన్నాయి.
అందుకే తన మార్క్ చూపించి.. మార్పులు, చేర్పులు చేయడానికి మంత్రి రంగం సిద్ధం చేశారు. శుక్రవారం నాడు ఉన్నత విద్యాశాఖ అధికారులతో లోకేష్ సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో చేపట్టాల్సిన మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో చర్చించడం జరిగింది. ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన చేయాలని నారా లోకేష్ నిర్ణయించారు.
మార్పులు, చేర్పులు!
వర్సిటీల ర్యాంకింగ్ మెరుగుదలకు పటిష్ట ప్రణాళిక ప్లాన్ చేయాలని అధికారులను లోకేష్ అదేశించారు. ముఖ్యంగా.. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలపై మంత్రి ఆరా తీశారు. వర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నట్లు లోకేష్ తెలిపారు. ‘ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల మెరుగుదల చేస్తాం. విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు శ్రీకారం చుడతాం. కాలేజ్‌లలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతాం. అడ్మిషన్ల పెంపుదల కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాం. ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చి, యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పెంచాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. పరిశ్రమల అవసరాలకు ఉపయోగపడే విధంగా కరిక్యులమ్ అప్ గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ నాలుగేళ్లు చదివిన విద్యార్థికి ఉద్యోగం రాని స్కిల్స్.. అమీర్‌పేటలో 4 నెలల శిక్షణ పొందితే ఎలా వస్తున్నాయి..?. అటువంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీకి చర్యలు తీసుకోవాలి’ అని లోకేష్ వెల్లడించారు. రూసా నిధుల వినియోగం అంశాలపై సమావేశంలో లోకేష్ చర్చించారు. వర్సిటీల రేటింగ్ పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.