Minister Nara Lokesh: పాలనపై నారా లోకేష్ తనదైన మార్క్.. హడావుడికి దూరంగా.. జనానికి దగ్గరగా

www.mannamweb.com


Minister Nara Lokesh aims to Bring Radical Changes in the Education Sector in AP: అవును ఏపీ మంత్రి లోకేష్.. జెట్ స్పీడ్ తో పని మొదలు పెట్టేశారు. టీడీపీ గత ప్రభుత్వంలోనూ మంత్రిగా పని చేసినా.. ఇప్పుడు మాత్రం కంప్లీట్ యాక్షన్ ప్లాన్ మార్చేశారు. స్పీడ్ పెంచేశారు. జనానికి మరింత చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బాధ్యతల స్వీకారానికి ముందే రంగంలోకి దిగేశారు. మంగళగిరి నియోజకవర్గం ఏర్పడ్డ 39 ఏళ్లలో అక్కడ టీడీపీకి అసలు విజయమే లేదు. కానీ నారా లోకేష్ రెండో ప్రయత్నంలోనే మంగళగిరిపై టీడీపీ జెండా ఎగరేశారు.

తెలుగుదేశం పార్టీకి రికార్డు విజయం సాధించి పెట్టారు. రికార్డు సృష్టించేలా చేశారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే గెలవాలి అన్న లక్ష్యంతో పని చేశారు నారా లోకేష్. నిజానికి చంద్రబాబు తనయుడిగా లోకేష్.. టీడీపీకి గట్టి పట్టు ఉండి, కచ్చితంగా గెలిచే చోటును ఏదైనా ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ లోకేష్ రూటే సపరేటు. పార్టీ కండీషన్ చాలా టఫ్ గా ఉన్న చోటే నిలబడి గెలిచారు. అనుకున్నది సాధించారు. చివరికి మంగళగిరి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించడం అలవాటు చేసుకున్న చంద్రబాబునే లోకేష్ స్పూర్తిగా తీసుకున్నారు. ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇదే మార్క్ చూపిస్తున్నారు. వర్క్ లో కచ్చితత్వం పెంచారు. ఏపీకి ఇప్పుడు ఏం అవసరం.. తనకు ఇచ్చిన శాఖల్లో పురోగతి చూపడం ఎలా అన్నది ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి పెట్టుకున్నారు. ఓవైపు పాలన, ఇంకోవైపు పార్టీ.. మరోవైపు ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడం ఇవన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చుట్టూ డైనమిక్ టీమ్ ను పెట్టుకున్నారు. దూకుడు పెంచారు.

నిజానికి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకుండా రికమండేషన్ తో మంత్రి అయ్యారని గతంలో వైసీపీ విమర్శించింది. అప్పుడు పని చేసింది కొంత కాలమే అయినా ఐటీ శాఖలో స్పీడ్ పెంచారు. ఇక 2019లో మంగళగిరిలో ఓడిపోయాక నాడు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల తాకిడి మరింత పెంచారు. అన్నిటినీ భరించారు. ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఘన విజయంతో అందరి ముందు సగర్వంగా నిలబడ్డారు లోకేష్. అంతే కాదు.. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. అందులో మొదటిది క్యాంప్ ఆఫీస్ లో డే వన్ నుంచి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు.

గత ఐదేళ్లుగా జనం పాలకుల నుంచి ఏది మిస్సయ్యారో దాన్ని మంత్రి నారా లోకేష్ గ్రహించారు. అందుకే ప్రజాదర్బార్ పేరుతో జనం నుంచి వినతులను స్వయంగా స్వీకరించారు. పరిష్కారంపై భరోసా ఇస్తున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్ జనంపై చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇన్నాళ్లకు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చాడు అనుకుంటున్నారు జనం. అటు మంత్రి లోకేష్ కూడా.. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా మార్చి తీరుతానంటున్నారు. రెండోసారి మంత్రి అయ్యాక లోకేష్ కు కీలక శాఖలే దక్కాయి. గతంలో చేపట్టిన ఐటీశాఖతో పాటు ఈసారి విద్యాశాఖ కూడా ఇచ్చారు. ఈ రెండూ ఛాలెంజింగ్ పోర్ట్ ఫోలియోసే. అయితే ఈ శాఖల్లో లోకేష్ తొలి రోజు నుంచే తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. రివ్యూ మీటింగ్ లు పెట్టారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖపై నజర్ పెట్టారు.

రాష్ట్రానికి కొత్తగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న అంశాలపై సమీక్షించారు. వీలైంత త్వరగా రిపోర్టులు ఇవ్వాలన్నారు. బెస్ట్ మెథడ్స్ ఎక్కడ అమలవుతున్నాయో పరిశీలించాలన్నారు. విశాఖను ఐటి హబ్‌గా, తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చాలని లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు రంగాల్లో ఏపీ టాప్ పొజిషన్‌లో ఉండాలని ఇప్పటికే అధికారులకు టార్గెట్ పెట్టారు. పెద్ద పెద్ద కంపెనీలు ఏపీ వైపు చూసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

త్వరలోనే కొత్త ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఐటీ పాలసీని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. జగన్ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు పూర్వవైభవం తెచ్చేలా ఫోకస్ పెంచారు లోకేష్. అటు విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా ఉండడంతో ఈ శాఖపై లోకేష్ ఫోకస్ మరింతగా పెంచారు. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లి దండ్రులతో భేటీ అయి.. వారి ఆశలు, ఆకాంక్షల ప్రకారం విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సరికొత్త ఐడియాతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రెడీ చేశారు.

పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, అలాగే టీచర్లకు కేవలం చదువుల బాధ్యతలే ఉండేలా చూడాలనుకుంటున్నారు. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి ఉన్నతవిద్యాశాఖలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించేలా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి టాప్ మోస్ట్ ప్రయారిటీలెన్నో లోకేష్ పెట్టుకున్నారు. ఒక విజన్ తో పని చేస్తున్నారు. చెప్పాలంటే యంత్రాంగాన్ని యాక్టివేట్ చేస్తున్నారు.

Also Read: రుషికొండ ప్యాలెస్‌పై షర్మిల మాట, సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్

ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆఫీసర్లకు లోకేష్ టార్గెట్ పెట్టారు. మధ్యాహ్న భోజనం రుచిగా, శుచిగా నాణ్యతగా ఉండాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఫాలో అవుతున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను స్టడీ చేసి వాటి కంటే మెరుగైన పద్ధతి అమలు చేయాలంటున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు కారణాలను విశ్లేషించి రిపోర్ట్ ఇవ్వాలని సమగ్ర శిక్షణ అధికారులను ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా ఇవ్వాలన్నారు. గ్రామాల్లో విద్యార్థులకు స్కూల్ ఎంత దూరంలో అందుబాటులో ఉందన్న వివరాలనూ అడిగారు. గత ఐదేళ్లలో మూతపడ్డ స్కూళ్లు, అందుకు కారణాలు తెలుసుకోవాలని ఆర్డర్ వేశారు.

దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను కూడా అందజేయాలని మంత్రి లోకేష్‌ ఆదేశించారు. ఇక ఈనెల 15న ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్షించిన సమయంలో.. ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ విద్యార్థులకు గత వైసిపి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు ఇవ్వడం ఆపేసిందని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పుస్తకాలు లేకుండా పేదవిద్యార్థులు ఎలా చదువుతారని ఆ సమావేశంలోనే అధికారులను ప్రశ్నించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి వెంటనే ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలని లోకేష్ ఆదేశించడంతో ఆఫీసర్లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఓవైపు ఇవన్నీ చేస్తూనే.. పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునేలా తగిన ప్రణాళికలకు ఆదేశించారు. సో ఓవరాల్ గా బాధ్యతల స్వీకారానికి ముందే తనకు అప్పగించిన శాఖలపై మంత్రి నారా లోకేష్ ఓ విడత కసరత్తు పూర్తి చేసేశారు. ఇక బాధ్యతల స్వీకారం తర్వాత యాక్షన్ ప్లాన్ మరింత స్పీడ్ అవడం ఖాయంగా కనిపిస్తోంది.