మీ కూతురి బంగారు భవిష్యత్తు కోసం.. ఈ పొదుపు పథకాలు ఉత్తమమైనవి

ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా ఆడబిడ్డల విషయంలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. నేటికీ ఆడపిల్లలు పుట్టకూడదని కోరుకునే తల్లిదండ్రులు, వారికి చదువు, ఉద్యోగాలు అనవసరమని భావించే ప్రజలు ఉన్నారు.
ఇలాంటి ధోరణి మారేందుకు, బాలికల విద్య, హక్కులు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు.


* బాలికల స్టడీ కోసం..
ఈ లక్ష్యాలు సాధించేందుకు ప్రభుత్వం చాలా పథకాలు రూపొందించింది. ఇందులో కొన్ని పథకాలు బాలికల చదువుకు సహకరిస్తాయి. మరికొన్ని సేవింగ్స్‌ స్కీమ్‌లు పెట్టుబడులపై అధిక వడ్డీలు చెల్లిస్తాయి. వీటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కుమార్తెకు బంగారు భవిష్యత్తు అందించవచ్చు. భారతదేశంలో ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* సుకన్య సమృద్ధి యోజన (SSY)
సుకన్య సమృద్ధి యోజన అనేది ప్రభుత్వం అందించే సేవింగ్స్‌ స్కీమ్‌. ప్రస్తుతం 8.2% వడ్డీ రేటును అందిస్తోంది. దీని వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు సమీక్షిస్తారు. చట్టపరమైన సంరక్షకుడు లేదా తల్లిదండ్రులు 10 సంవత్సరాల వయస్సు వరకు ఆడపిల్ల కోసం ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఇందులో మినిమం రూ.250తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఇన్వెస్ట్‌ చేసే మొత్తం రూ.50 మల్టిపుల్స్‌లో ఉండాలి. ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి అకౌంట్‌ని ఓపెన్‌ చేయడానికి సమీపంలోని పోస్టాఫీస్‌ని సంప్రదించండి.

* సీబీఎస్‌ఈ ఉడాన్ స్కీమ్‌
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరేందుకు బాలికలకు సహాయం చేస్తుంది. టెక్నికల్‌ ఫీల్డ్స్‌లో మహిళల సంఖ్యను పెంచే ఉద్దేశంతో స్కీమ్‌ రూపొందించారు. ఇంజనీరింగ్ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లకు ఉచిత ఆన్‌లైన్ ట్రైనింగ్‌, గైడెన్స్‌, ప్రిపరేషన్ టూల్స్‌ అందిస్తుంది.

* ఎల్‌ఐసీ జీవన్ తరుణ్
ఇది పిల్లల కోసం LIC అందించే సేవింగ్స్‌, ఇన్సూరెన్స్‌ ప్లాన్. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య పిల్లల విద్యకు ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో రూపొందించారు. ఈ ప్లాన్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్ అందిస్తుంది. అలానే చదువుకునే సమయంలో ఏటా చెల్లింపులు చేస్తుంది. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి లంప్‌ సమ్‌ అమౌంట్‌ అందిస్తుంది.

* చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్
పిల్లల విద్య, పెళ్లి అవసరాలకు ఈ మ్యూచువల్ ఫండ్‌ రూపొందించారు. ఈ ఫండ్స్‌ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లు(ఫిక్స్‌డ్‌-ఇన్‌కమ్‌ సెక్యూరిటీలు వంటివి), ఈక్విటీల(షేర్లు వంటివి)లో పెట్టుబడులను డైవర్సిఫై చేస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఇందులో ఇన్వెస్ట్‌ చేయవచ్చు.

* బాలికా సమృద్ధి యోజన (BSY)
ఈ ప్రభుత్వ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికలకు తోడ్పాటు అందిస్తుంది. హయ్యర్ సెకండరీ స్కూల్ వరకు విద్యకు సహాయం చేయడానికి యాన్యువల్‌ స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఆడపిల్ల పుట్టినప్పుడు నగదు బహుమతి కూడా అందజేస్తారు.