బొబ్బట్లను పిల్లలు, పెద్దలూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని ఒక్కొక్కరు ఓ స్టైల్లో చేస్తుంటారు. అలా కాకుండా ఈసారి ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో బొబ్బట్లు చేశారంటే అద్దిరిపోతుంది. అంతేకాక పప్పు ఉడికించి గ్రైండ్ చేసే పనిలేకుండానే సింపుల్‌గా వీటిని చేసుకోవచ్చు. మరి టేస్టీటేసీ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి – 1 కప్పు
- మైదాపిండి – అర కప్పు
- ఉప్పు – చిటికెడు
- పసుపు – పావు టీ స్పూన్
- నెయ్యి – 1 టేబుల్ స్పూన్
- బెల్లం – 1 కప్పు
- బొంబాయి రవ్వ – 1 టేబుల్ స్పూన్
- శనగపిండి – 1 కప్పు
- యాలకుల పొడి – అర టీ స్పూన్
- నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు
-
తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో ఒక కప్పు గోధుమపిండి, అర కప్పు మైదాపిండి వేయాలి. అలాగే చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఇందులోకి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఐదు నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. ఆ పైన రెండు టీ స్పూన్ల నెయ్యి అప్లై చేసి మూతపెట్టి అరగంట సేపు పక్కనుంచాలి.
- మరోవైపు పూర్ణం కోసం గిన్నెలో ఒక కప్పు బెల్లం, ఒకటిన్నర కప్పుల నీళ్లను పోసి బెల్లాన్ని కరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇంకోవైపు పాన్‌లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, ఒక కప్పు శనగపిండి వేసి ఏడు నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. ఇందులోనే వేడి చేసి పెట్టుకున్న బెల్లం నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ బాగా కలపాలి.
- ఇప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా అర టీ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం పూర్ణం మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకోవాలి.
- పూర్ణం చల్లారిన తర్వాత మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేసుకోవాలి.
- ఇంకోవైపు కలిపి పెట్టుకున్న గోధుమపిండిమైదాపిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ముద్దలుగా చేయాలి.
- ఇప్పుడు ప్లాస్టిక్ కవర్‌కి నెయ్యి అప్లై చేసి ఒక్కొ పిండి ముద్దను చిన్నపాటి పూరీలాగా చేసి మధ్యలో రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కింద ఫొటోలో చూపిన విధంగా ఉంచి సీల్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దీనిని మరోసారి ఒత్తుకొని చపాతీ పీటపై తీసుకొని కర్రతో చపాతీ లాగా చేసుకోవాలి.
- అనంతరం స్టవ్‌పై పెనం పెట్టుకొని రెడీ చేసుకున్న బొబ్బట్టును ఒక్కొటి వేయాలి. ఇప్పుడు ఓ సైడ్ కాలిన తర్వాత నెయ్యి అప్లై చేసి మరోవైపు టర్న్ చేసి కాల్చుకోవాలి.
- రెండు వైపులా బాగా కాలిన తర్వాత వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
- ఇక అంతే టేస్టీటేస్టీ నేతి బొబ్బట్లు మీ ముందుటాయి!


































