తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ ప్రెస్-టైమింగ్స్, హాల్ట్ లివే..!

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. ఈ రెండు రాష్ట్రాల మీదుగా ప్రయాణించేలా కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెలలోనే ప్రారంభిస్తోంది.


వారానికి ఓసారి మాత్రమే ఈ రైలు రాకపోకలు సాగించనుంది. తమిళనాడులోని ఈరోడ్, బీహార్ లోని జోగ్బనీ స్టేషన్ల మధ్య నడిచేలా దీనికి రూపకల్పన చేశారు. రెండు వైపులా రెండు రైళ్లను ప్రవేశపెడుతున్నారు.

ముందుగా ఈరోడ్ నుంచి జోగ్బనీ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (నంబర్ 16601)ను ఈ నెల 25న (గురువారం) ప్రారంభించనున్నారు. ఉదయం 8.10కి ఈరోడ్ లో ఈ రైలు ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ఏపీలోని గూడూరు జంక్షన్ కు సాయంత్రం 4.40కి చేరుకుంటుంది. ఒంగోలులో సాయంత్రం 6.58కి, విజయవాడలో రాత్రి 9.15కి, తెలంగాణలోని ఖమ్మంలో రాత్రి 11.09కి, వరంగల్లో అర్ధరాత్రి 12.53కి (మరుసటి రోజు), మంచిర్యాలలో తెల్లవారుజామున 2.59కి ఆగేలా హాల్ట్ లు ఇచ్చారు. అనంతరం ఈ రైలు శనివారం అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు జోగ్బనీకి చేరుకుంటుంది.

అలాగే జోగ్బనీలో అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఈ నెల 28న (ఆదివారం) మధ్యాహ్నం 3.15కి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి తెలంగాణలోని మంచిర్యాలకు 30వ తేదీ మంగళవారం ఉదయం 9.04కు చేరుకుంటుంది. అక్కడి నుంచి వరంగల్ లో 10.58కి, ఖమ్మంలో 12.24కు, విజయవాడలో మధ్యాహ్నం 2.40కి, ఒంగోలులో సాయంత్రం 5.03కు, గూడూరులో రాత్రి 7.50కు హాల్ట్ లు ఇచ్చారు. అనంతరం ఇది అక్టోబర్ 1న బుధవారం ఉదయం 7.20కు ఈరోడ్ కు చేరుకుంటుంది. ఈ రెండువైపులా ప్రయాణించే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ వీక్లీ రైళ్లలో స్లీపర్ తో పాటు జనరల్, సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.