ఆంధ్రాలోని లంబసింగి అనగానే మెుదటగా గుర్తొచ్చేది చలి. ఈ ప్రదేశాన్ని చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. లంబసింగిని రైతులు పూల లోయగా మారుస్తున్నారు.
లంబసింగి.. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ ప్రకృతిని చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు వస్తుంటారు. అయితే ఇక్కడ కొంతమంది రైతులు పూల తోటలను పెంచుతున్నారు. దీని ద్వారా బిజినెస్ చేస్తున్నారు. నర్సీపట్నం, అనకాపల్లి, ఇతర మైదాన ప్రాంతాలకు చెందిన కౌలు రైతులు లంబసింగి ప్రాంతంలో స్థానిక రకం, ఇతర పువ్వులను పెంచుతున్నారు. పర్యాటకులను ఆకర్షిస్తున్నారు.
ఈ రైతులు నాగ్‌పూర్, పూణే, బెంగళూరు, ఏపీలోని కడియం నుండి మొక్కలు, విత్తనాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని పూల లోయగా మార్చుతున్నారు. వివిధ రకాల బంతి, చామంతి, గెర్బెరా, దాలియాతోపాటుగా మరికొన్ని పువ్వులను పెంచుతున్నారు.
అయితే దీనిని ప్రొఫెషనల్‌గా కాకుండా సైడ్ ఇన్‌కమ్‌లా చూస్తున్నారు రైతులు. పర్యాటకుల నుండి కొంత డబ్బు పొందుతున్నారు. పూల తోటలను సందర్శించడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఒక్కరి దగ్గర రూ.30 నుంచి రూ.40 వరకు తీసుకుంటున్నారు. లంబసింగి వచ్చి.. మంచు, చలిలో ఫొటోలు దిగితే వచ్చే కిక్కును పర్యాటకులు కూడా ఇష్టపడుతున్నారు. దీనితో రైతులు అదే పనిలో ఉన్నారు. అంతేకాదు గ్లాడియేలస్లాంటి డెకరేషన్ పూల సాగు కూడా మెుదలిపెట్టి ఆపేసినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు పాడేరులో 50 హెక్టార్లలో బంతిపూలను పైలట్ ప్రాజెక్టును చేపట్టినట్లు ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. దాదాపు 150 మంది రైతులు ఉన్నారు. ఉద్యానవన శాఖ వారికి 50 సెంట్లకు రూ.3,000 చెల్లిస్తుందని తెలుస్తోంది. ఈ రైతులు స్థానిక వ్యాపారులకు పూలు అమ్మి జీవనోపాధి పొందుతున్నారు. ఈ పథకాన్ని త్వరలో ఇతర మండలాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఆ శాఖ ఉంది.
చింతపల్లి, లంబసింగి వంటి ఎత్తైన ప్రాంతాలు గిరిజన రైతులకు అధిక విలువ కలిగిన పంటలను అందించే గ్లాడియోలస్, ట్యూలిప్స్ వంటి ఇతర పువ్వులు పండించడానికి అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రత్యేక పువ్వులకు ఈ ప్రాంత వాతావరణం అనుకూలంగా ఉండటం వల్ల, డిమాండ్‌ను తీర్చడానికి, గిరిజన వర్గాలకు లాభదాయకమైన ధరలకు ఉత్పత్తి జరుగుతుంది.

































