ఏపీలో కొత్త క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్

ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ స్టేడియం నిర్మించాలని ఆలోచనలు చేస్తోంది.


ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలో కొత్తగా క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మంత్రి టీజీ భరత్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. పంద్రాగస్టు సందర్భంగా కర్నూలులో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీజీ భరత్.. కర్నూలు క్రికెట్ స్టేడియం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు జగన్నాథగట్టు వద్ద క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ వివరించారు. ఆరెకరాల్లో క్రికెట్‌ స్టేడియం నిర్మాణంతో పాటుగా క్రీడా ప్రాంగణం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కర్నూలు క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం జూన్ నెలలో మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

జగన్నాథగట్టు వద్ద క్రికెట్ స్టేడియంతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. టిడ్కో ఇళ్ల సముదాయానికి ఎదురుగా ఈ నిర్మాణం జరగనుంది. గ్రీన్ కో సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద అందిస్తున్న నిధులతో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే ఈ ప్రాంతంలో క్రీడాభివృద్ధికి తోడ్పడుతుందని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది. జగన్నాథగట్టు వద్ద ఆరెకరాల్లో క్రికెట్ స్టేడియంతో పాటుగా కర్నూలు జిల్లాలో మరో స్టేడియం కూడా నిర్మించనున్నారు.

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సహకారంతో కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని బాల సాయి బాబా స్కూలు సమీపంలోని ఏసీఏ మైదానంలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు.

స్టేడియాల విషయానికి వస్తే ఉమ్మడి రాయలసీమ జిల్లాలలో కర్నూలుకు తప్ప మిగతా మూడు జిల్లాలకు స్టేడియాలు ఉన్నాయి. తిరుపతి, అనంతపురం, కడపలో స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు మాత్రమే స్టేడియం లేకపోవటంతో ఏసీఏ సహకారంతో ఇక్కడ కూడా క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆలోచనలు చేస్తున్నారు.

అదే విధంగా సీఎస్ఆర్ నిధులతో జగన్నాథగట్టు వద్ద ఆరు ఎకరాల్లో స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. మరోవైపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ స్టేడియాలను నిర్మించి గ్రామీణ ప్రాంత యువతలో దాగున్న క్రీడా నైపుణ్యాలను వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వారికి అందించే ప్రోత్సాహకాలను కూడా పెంచిన సంగతి తెలిసిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.